రాజమహేంద్రవరం, ఆగస్టు 10 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలో మెడికో డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రియాంక చికిత్స కోసం ప్రభుత్వం సుమారు రూ.10 లక్షల వైద్య ఖర్చులను భరించిందని, కుటుంబ సభ్యులకు మరో రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని చెప్పారు. ప్రియాంక తీవ్రంగా గాయపడిన సమయంలో కేసులో కఠినమైన సెక్షన్లు చేర్చామని, ఆమె మృతి అనంతరం హత్య కేసుగా మార్చినట్లు వివరించారు.
మద్యం, మాదకద్రవ్యాల ప్రభావంలో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరంలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు పెరిగాయని ఆరోపించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.



