కనిగిరిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు.. ఎస్సై సందీప్‌ను సస్పెండ్ చేయాలి
సీపీఎం పట్టణ కార్యదర్శి, 29వ వార్డు అభ్యర్థి పోలిచెర్ల కేశవరావు డిమాండ్
కనిగిరి:
కనిగిరి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి, 29వ వార్డు అభ్యర్థి పోలిచెర్ల కేశవరావు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు కూటమి నాయకులు తనతో పాటు పోలింగ్ ఏజెంట్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉండేందుకు కూడా అవకాశం లేకుండా ఎస్సై సందీప్ ఏకపక్షంగా వ్యవహరించారని, దుర్భాషలాడుతూ తనను ఇబ్బందులకు గురిచేయడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు కూటమి నాయకులకు సహకరించారని ఆరోపించారు. 29వ వార్డులో ఓటు హక్కు లేని కూటమి నాయకులు సైతం అక్రమంగా ఓట్లు వేశారని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా భయాందోళన వాతావరణం సృష్టించారని విమర్శించారు.
పోలింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అధికారుల ఏకపక్ష వైఖరి కారణంగానే తాము ఓటమి చెందాల్సి వచ్చిందని కేశవరావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని, ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సందీప్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అక్రమాలకు బాధ్యులైన కూటమి నాయకులు, సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఏడుకొండలు ,నరేంద్ర,ప్రసంగి, నాగరాజు ,చెన్నకేశవలు,కాసయ్య,వెంకటయ్య ,శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
