ఉచిత ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన కంచి పరమేశ్వర రెడ్డి
ఆత్మకూరు, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి): ఏఎస్ పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జల ప్రసాదం’ పథకం కింద ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో ప్లాంట్ను ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రజలకు అంకితం చేసిన ఆయన స్విచ్ ఆన్ చేసి తొలుత నీటిని తాగారు. అనంతరం గ్రామస్తులకు ఉచితంగా తాగునీటిని పంపిణీ చేయడంతో పాటు మహిళల బిందెల్లో స్వయంగా నీటిని నింపి అందించారు. గ్రామస్తులు ఆయనను పూలమాల, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారంగా ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రతినిధులు వెలిశెట్టి నారాయణరావు, గోవిందరెడ్డి, కొల్లా వెంకటేశ్వర్లు సేవలను కొనియాడారు. 2023 మార్చి 31న ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో అన్నప్రసాదంతో ప్రారంభమైన సేవా ప్రస్థానంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నీటిని అందిస్తామని, నిర్వహణ సిబ్బందికి నెలకు రూ.5 వేల వేతనం ట్రస్ట్ చెల్లిస్తుందని పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, సేవలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.




