అరకులోయ: స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నడవాలని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర అన్నారు. గురువారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో అరకులోయలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆశావహులు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని, అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని దొన్నుదొర సూచించారు. ఆశావహుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా అభ్యర్థులను అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు బుద్ధ నాగ జగదీష్, ఎన్నికల పరిశీలకుడు పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, మాజీ మంత్రి మణికుమారి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఎంవీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



