వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 7 :: ఎన్నికల ప్రచార హోరు ముగిసింది...
- పోలింగ్ ప్రక్రియ పూర్తయింది...
- ఇక అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే!
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 7 ::
ఎన్నికల ప్రచార హోరు ముగిసింది… పోలింగ్ ప్రక్రియ పూర్తయింది… ఇక అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే! ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ భవిష్యత్తును తేల్చే ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు, వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవైపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి… మరోవైపు ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు! తమకే విజయం దక్కుతుందన్న నమ్మకంతో అభ్యర్థులు, అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, ఓటర్లు మాత్రం తమ తీర్పును బ్యాలెట్లో నిక్షిప్తం చేసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్రామగ్రామాన గెలుపోటములపై చర్చలు జోరందుకున్నాయి. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? ఏ అభ్యర్థి రాజకీయ భవిష్యత్తుకు నేటి ఫలితాలు బాటలు వేయనున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
నేడు వెలువడనున్న ఫలితాలతో అభ్యర్థుల ఆశలు, అంచనాలకు తెరపడనుంది. ఎవరికి విజయలక్ష్మి వరించనుంది? ఎవరి ధీమా నిజం కానుంది? ఎవరి ఆశలు అడియాశలు కానున్నాయి? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
**అంతిమంగా ప్రజాతీర్పే శిరోధార్యం… ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం!**
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్