తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బోనకల్ మండలంలోని చొప్పకట్లపాలెం, రామపురం గ్రామాల్లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు.



