తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి)
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గురువారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీ శ్రీధర్, జాయింట్ కమిషనర్ శ్రీమతి జానకి, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు.
చారిత్రక ప్రాశస్త్యం :
తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.
ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
————————
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




