చోడవరం, జూలై 20 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): చోడవరం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నల్లమిల్లి గనిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు (బాబు) సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక సేవలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి సంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గతంలో పోలియో నిర్మూలన, క్షయవ్యాధి నియంత్రణ వంటి కార్యక్రమాల్లో ఈ సంస్థలు విశేష సేవలు అందించాయని, ప్రస్తుతం ప్రకృతి పరిరక్షణ, క్యాన్సర్ నివారణ, విద్యార్థుల ప్రోత్సాహం వంటి అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత, విద్యుత్ వినియోగం వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సేవా సంస్థలు ముందుండాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై గ్రామ స్థాయిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నూతన కార్యవర్గాన్ని కోరారు.
క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, బాలికలు మాత్రమే కాకుండా అవసరమైన వర్గాలందరూ వ్యాక్సిన్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌పై అపోహలను తొలగించి ప్రజలకు సరైన సమాచారం అందించడంలో లయన్స్ క్లబ్, ఇతర సేవా సంస్థలు భాగస్వాములు కావాలని అన్నారు.
చోడవరం ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎస్.ఎన్.ఎస్. రాజు చేపడుతున్న క్యాన్సర్ రోగుల సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అభినందించారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
నూతన అధ్యక్షుడు నల్లమిల్లి గనిరెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చోడవరం, అనపర్తి నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గనిరెడ్డి అభిమానులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.




