శ్రీ కాళహస్తి, జూన్ 01, (పున్నమి న్యూస్) : దేశంలోనే తొలి శివాలయంగా ప్రసిద్ధి చెందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్‌కు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలు, చారిత్రక ప్రాధాన్యంపై ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్‌కు వివరించారు. అనంతరం గుడిమల్లం ఆలయ చరిత్రకు సంబంధించిన గ్రంథాన్ని బహుకరించి, తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్పీకర్ కుమారుడు చింతకాయల విజయ్ కుమార్, ఆలయ చైర్మన్ గిరినాయుడు, ఈవో మునిశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పల్లం రాజకుమార్ నాయుడు, వేద పండితులు వంశీకృష్ణ శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.


