తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపడుతున్న అన్ని ఏర్పాట్లు, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని డీజీపీ సూచించారు. రాబోయే పుష్కరాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో పోలీసు అధికారులతో డీజీపీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, వాహనాల పార్కింగ్, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, కీలక ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ర్ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పుష్కరాల ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఘాట్లు, ప్రధాన రహదారులు, కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తులు అధికంగా గుమిగూడే ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీజీపీ పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి, పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పుష్కరాల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, పుష్కరాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ స్పష్టం చేశారు.


