మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి – గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఆత్మకూరు, జూన్ 8 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారత దేశ యాత్రలో భాగంగా కాశీకి బయల్దేరిన ప్రైవేట్ బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేమేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు యాత్రికులు, ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే ఈ విషాద ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ప్రమాదంలో గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని మేకపాటి విక్రమ్ రెడ్డి ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే యాత్రకు వెళ్లిన మిగతా భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారత దేశ యాత్రకు బయల్దేరిన ప్రైవేట్ బస్సులో ఆత్మకూరు, సంగం, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన మొత్తం 43 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. గయా క్షేత్ర దర్శనం ముగించుకుని వారణాసికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు.ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్న భక్తులు ప్రమాదానికి గురికావడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాత్రా వాహనాల భద్రత, డ్రైవర్ల అప్రమత్తతపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.


