ఏటికొప్పాకకు చెందిన ముగ్గురికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు
యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో సీట్లు సాధించి సత్తా చాటారు. ఏటికొప్పాక సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన వై. అఖిల, పి. పవన్‌కుమార్, ఎల్. శేషవర్షిణి ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ ట్రిపుల్‌ఐటీలకు ఎంపికయ్యారు.
అఖిల ఐఐటీ పాట్నా, పవన్‌కుమార్ ఎన్‌ఐటీ నాగ్‌పూర్, శేషవర్షిణి సెంట్రల్ ట్రిపుల్‌ఐటీ కర్నూలులో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్ అన్నం గోవిందరావు విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. సాధన పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
ఒకేసారి ముగ్గురు ఏటికొప్పాక విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ ట్రిపుల్‌ఐటీలకు ఎంపిక కావడంపై గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యు. వెంకటరమణ, హెచ్‌ఎం ఎ. తాతారావు, ఏవో బి. రామకృష్ణ, ఇన్‌చార్జి హెచ్‌ఎం బి. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


