ఆదిభట్లలో పారిశుద్ధ్య సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు
ఆదిభట్ల, ఆగస్టు 14: ఆదిభట్ల ప్రధాన రహదారిలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజన్ నాల సమీపంలో రోడ్డు పక్కనే పెద్దఎత్తున చెత్తకుప్పలు పేరుకుపోయాయి. చెత్త వేయరాదని సూచించే బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, దాని పక్కనే చెత్తను పడేస్తుండటం అధికారుల పర్యవేక్షణపై విమర్శలకు దారితీస్తోంది. చెత్తకుప్పల నుంచి దుర్వాసన వెలువడటంతో పాటు పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ప్రజలు చెబుతున్నారు.
మరోవైపు టీసీఎస్ రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దోమల తీవ్రత అధికంగా ఉంటోందని, ఫాగింగ్ నిర్వహించాల్సిన సానిటేషన్ సిబ్బంది క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అంజన్ నాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, టీసీఎస్ రోడ్డులో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఫాగింగ్ నిర్వహించి దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిభట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Uploaded Video:






