డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ప్రత్యేక చర్యలు
ఆత్మకూరు, మే 22 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు యూపీహెచ్‌సీ అరుంధతివాడ పరిధిలోని ఎం ఆర్ సి సచివాలయంలో డాక్టర్ షేక్ మష్కూర్ అహ్మద్ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.జిల్లా మలేరియా అధికారి సింహాచలం సూచనల మేరకు జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమాల్లో ముందంజలో నిలవాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయని, ఇంటి పరిసరాల్లో ఎక్కడా నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కూలర్లు, నీటి డబ్బాలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలలో నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి వారం ఒకరోజు డ్రై డేగా పాటించి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రపరచాలని ప్రజలను కోరారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అలాగే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలను ప్రత్యేకంగా సందర్శించి ఆరోగ్య సూచనలు అందించారు.
తల్లి-శిశు సంరక్షణ కార్డులు, వ్యాక్సినేషన్ రికార్డు పుస్తకాలలో వ్యాక్సిన్ తేదీలు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. బాలికలు, మహిళలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, ఏఎన్ఎం సామ్రాజ్యం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

