అనపర్తి, జూలై 15 ( పున్నమి న్యూస్ ): అనపర్తి మండలం రామవరం గ్రామంలో జూలై 23, 24, 25 తేదీలలో అనపర్తిలో నిర్వహించనున్న “అమరావతి చాంపియన్షిప్–2026” సెలక్షన్స్ సందర్భంగా గోడపత్రికను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు అమరావతి చాంపియన్షిప్ మంచి వేదిక అని పేర్కొన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ సెలక్షన్స్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలను నిర్వహిస్తోందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.



