*అకాల వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి – అధికారుల అప్రమత్తతతో అర్ధరాత్రికల్లా విద్యుత్ పునరుద్ధరణ*
*ఏన్కూరు*
ఏన్కూరు మండలంలో పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ శాఖకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. రాత్రి సమయంలో పలు గ్రామాల్లో వీచిన బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గాలి దుమారానికి తీగలు తెగిపడటంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
సుమారు 15కి పైగా 11KV, LT స్తంభాలు విరిగిపోయాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ శాఖకు లక్షల మేర నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ఏన్కూరు విద్యుత్ శాఖ ఏఈ ఉమాకాంత్ మరియు సిబ్బంది రంగంలోకి దిగారు.
మండల
వ్యాప్తంగా బృందాలుగా విడిపోయి మరమ్మత్తు పనులు చేపట్టారు. కూలిన స్తంభాలను తొలగించి, కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, తెగిపడిన తీగలను అనుసంధానించారు.
అధికారులు, సిబ్బంది అర్ధరాత్రి 1 గంట వరకు శ్రమించి మెజారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కష్టమైన ప్రాంతాల్లో బుధవారం ఉదయానికి పనులు పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ ఏ ఈ తెలిపారు.
ఏ ఈ ఉమాకాంత్ మాట్లాడుతూ
విద్యుత్ స్తంభాలు కూలిపడి ఉన్న ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన తీగలను తాకవద్దని అధికారులు సూచించారు. ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.


