ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అల్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో చరవాణిలో మాట్లాడిన మంత్రి, వర్షాలు, వరదలు, ఇతర పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు.



