పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారునికి రూ.1 లక్ష ఆర్థికసాయం.
కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆర్థిక చేయూత.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో సీఎంవోకు లేఖ.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, సెప్టెంబర్ 18:
విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువ పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు సంకు కృపారావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన పి4 పథకం ద్వారా రూ.1 లక్ష ఆర్థికసాయం మంజూరైంది.
కెనడాలో జరగనున్న కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సంకు కృపారావుకు ఆర్థిక సహాయం అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికసాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు సీఎంవో ద్వారా చర్యలు చేపట్టగా, సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి రూ.1 లక్ష ఆర్థికసాయం మంజూరైంది. సిఎంవో ఆదేశాలకు లోబడి జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ, ఐఏఎస్ గారు ఈ ఆర్థిక సహాయాన్ని క్రీడాకారుడు సంకు కృపారావు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కృపారావు తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి కెనడాలో జరిగే కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసి పతకం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్టీఆర్ జిల్లాకు, మైలవరం నియోజకవర్గానికి, వెంకటాపురం గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు క్రీడాకారుడు సంకు కృపారావును అభిలషించారు.
యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో తన అంతర్జాతీయ క్రీడా ప్రయాణానికి ఆర్థిక సహాయం లభించడం పట్ల కృపారావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



