చౌదర్పల్లిలో కోళ్ల ఫారాల దుర్వాసన, ఈగల బెడద నుంచి గ్రామాన్ని కాపాడాలి
ఈగలతో పంటలు నాశనం.. రోగాల బారిన పడుతున్న పశువులు – రైతుల ఆవేదన
యాచారం, జూలై 2: యాచారం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాల వల్ల గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫారాల నుంచి వస్తున్న దుర్వాసన, ఈగలు, దోమల బెడదతో గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని బీజేపీ మండల నాయకుడు నడికుడి కృష్ణ, వార్డు సభ్యులు కావలి కిరణ్ కుమార్, కొమ్ము యాదయ్య, రైతులు గొరిగే మల్లేష్, గౌర పర్వతాలు ఆరోపించారు.
గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారాల నుంచి సాయంత్రం కాగానే తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, దీంతో గ్రామస్తులు ఇళ్ల బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు, జ్వరాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఈగల బెడద కారణంగా తాము ఎంతో కష్టపడి సాగు చేసిన కూరగాయల పంటలు, ఇతర పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలపై ఈగలు, పురుగులు విపరీతంగా చేరి దిగుబడిని తగ్గిస్తున్నాయని, ఇప్పటికే వేలాది రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. పంటలు మార్కెట్‌కు తీసుకెళ్లినా నాణ్యత తగ్గడంతో సరైన ధర లభించడం లేదని వాపోయారు.
అలాగే గ్రామంలో ఉన్న పాలిచ్చే ఆవులు, గేదెలు కూడా దోమలు, ఈగల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. పశువులు సరైన విధంగా మేత తీసుకోలేకపోతున్నాయని, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోందని రైతులు పేర్కొన్నారు. పశువులకు చర్మ సంబంధిత వ్యాధులు, జ్వరాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు కోళ్ల ఫారాల యజమానులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. దుర్వాసన నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, ఈగలు, దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఫారాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కోళ్ల ఫారాల యజమానులు మానవతా దృక్పథంతో వ్యవహరించి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే దోమల నివారణ మందులు పిచికారీ చేయాలని, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, దుర్వాసన నివారణకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామంలో పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చౌదర్పల్లి గ్రామ ప్రజలను, రైతులను ఈ సమస్య నుంచి కాపాడాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గ్రామస్థులంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.






