విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు తీవ్ర స్థాయిలో స్పందించి ఖండించాలని విజ్ఞప్తి చేశారు.గురువులపై జరిగిన దాడిని రాష్ట్ర భవిష్యత్ దిశానిర్దేశకుడు నారా లోకేష్‌పై జరుగుతున్న దాడిగా భావించి టీడీపీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని నరసయ్య అన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు చేస్తున్న దాడులను అన్ని స్థాయిల్లోని టీడీపీ నాయకులు ఖండించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ముందస్తుగా పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం వల్లే ఉపాధ్యాయులు గాయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.అదేవిధంగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై నాయకుడి స్థాయి, హోదాతో సంబంధం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొమరా వెంకట నరసయ్య కోరారు.


