బద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 22, (పున్నమి ప్రతినిధి )
కొత్తగూడెం: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా డీజే వినియోగంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉత్సవాల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని కొత్తగూడెం డీఎస్పీ ఎల్. ఆదినారాయణ సూచించారు. అటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దంతో మ్యూజిక్ పెట్టడం, ర్యాలీల్లో డీజేలు వినియోగించడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలు, స్పీకర్లు, యాంప్లిఫయర్లు స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే డీజే సెట్లను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా రాత్రివేళల్లో శబ్ద కాలుష్యం వల్ల వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సూచనలను పాటిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని డీఎస్పీ కోరారు.



