కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ,వార్డు మెంబర్లు, సర్పంచులు,ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా, స్వేచ్ఛా యుత వాతావరణంలో సజావుగానిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఎం పి డి ఓ లు డిప్యూటీ ఎంపీడీవోలను ఆదేశించారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత పై సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..* ఎన్నికల నిర్వహణ లో ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పనపై సమీక్షిస్తూ ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా, తాగునీరు,మరుగు దొడ్లు, ర్యాంపులు,ఫర్నిచర్ తదితర కనీస వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ప్రవేశ మార్గాలు,బయటకు వెళ్లే మార్గాలు స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రం మార్చాల్సిన పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాన్ని ముందుగానే గుర్తించి,దాని పేరు తదితర వివరాలను నిబంధనల మేరకు ముందస్తుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ర్యాంపులు,మరుగుదొడ్లు వంటి అవసరమైన నిర్మాణాలు లేదా మరమ్మతుల పై ఇప్పటి నుంచే దృష్టి సారించాలన్నారు.
శిథిలావస్థకు చేరిన భవనాల స్థితిగతులపై సంబంధిత ఇంజనీర్ల నుంచి ధ్రువీకరణ నివేదికలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.అవసరమైన మరమ్మతు పనులకు మండల ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతి పాదనలు సమర్పించి, వాటిని సకాలంలో పూర్తి చేయాల న్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణ లో నిబంధనల ప్రకారం అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాంటి కేంద్రాల్లో అవసరమైన అదనపు భద్రతా ఏర్పాట్ల కోసం ముందుగానే ప్రతిపాదనలు పోలీస్ శాఖకు పంపాలన్నారు.ఎన్నికల నిర్వహణ కు అవసరమైన సామగ్రిలో కొంత మేర రాష్ట్ర స్థాయి నుంచి సరఫరా అవు తుందని,మిగిలిన సామగ్రిని జిల్లా స్థాయిలో సమకూర్చు కునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులను కూడా సమకూర్చుకోవాలన్నారు.
రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం ప్రచురించిన *హ్యాండ్ బుక్ ఫర్ ఆర్వో’**ను సమగ్రం గా అధ్యయనం చేసి, అందులోని నిబంధనలు, విధివి ధానాలను ఎన్నికల నిర్వ హణలో తప్పనిసరి గా పాటించాలని స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు కూడా తమ విధులు,బాధ్యతలపై ముందస్తుగా పూర్తి అవగాహన పెంపొందించు కుని,నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. మాస్టర్ ట్రైనీలను ముందు గానే ఎంపిక చేసి వారి జాబితాను సిద్ధం చేయాలని,అనంతరం ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్య క్ర మాలను ప్రణాళికాబద్ధంగా, సకాలంలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులు గా సమర్థత కలిగిన అధికారులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ప్రతి మండల స్థాయిలో అనువైన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సామగ్రి స్వీకరణకు అనువైన రిసెప్షన్ సెంటర్ కూడా మండల కేంద్రం లో ఎంపిక చేసుకోవాలనిసూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రూట్ల ను, సెక్టార్లను,జోన్లను ముందుగానే విభజించు కుని, ప్రతి ప్రాంతానికి తగిన అధికారులను, సిబ్బంది ని కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.
గ్రామస్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఎన్నికల సందర్భంగా ప్రజల భాగ స్వామ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్త కుండా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత,ప్రశాంత, పారదర్శక వాతావరణం లో సజావుగా నిర్వహించడం అధికారులందరి బాధ్యతని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీపీఓ పి.రవికుమార్,జడ్పీ సీఈవో వి.వి.వి.ఎస్.లక్ష్మణరావు, ఎంపీడీవోలు,డిప్యూటీ ఎంపీడీవోలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



