కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించాలని ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.గురువారం కత్తిపూడి సీతారామ జూనియర్ కళాశాలలో జరిగిన “పేదల సేవలో 2.0” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ..* ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేస్తేనే సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు సంపూర్ణంగా అందుతాయని ఉద్ఘాటించారు. ప్రజల ఇంటి ముంగిటకే మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పేదల సేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, పింఛన్ల పంపిణీ తీరు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రజల సంతృప్తే పరమావధిగా రాబోయే పదిహేను నెలల కాలంలో ప్రతి స్వర్ణ గ్రామం పరిధిలో ఈ సేవలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా *ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ..* గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గతంలోనూ, తాజాగా రూ. 11 వేల కోట్ల భారీ నిధులతో మూడవ విడత కింద రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో కూడా ఈ నిధులతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, గోశాలల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు ఆమె వివరించారు.
యువత, మహిళలు కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, స్వయం ఉపాధి ద్వారా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆమె పిలుపు నిచ్చారు.మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన శిక్షణ, బ్యాంక్ రుణాల ద్వారా పూర్తి సహాయం అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, కోళ్ల పెంపకం వంటి రంగాలలో రాణిస్తూ తోటివారికి ఉపాధి కల్పిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసాని అందరూ సద్వినియోగం చేసుకుని మరింత ముందుకు రావాలని ఆమె ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్యేక అధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ.శ్రీనివాసరావు ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


