*స్పాట్… చావనైనా చస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం.*
28-05-2020 *బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి)* కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 సంవత్సరంలో దళితులు ఆకలికి అలమటించ కుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మిగిలిన భూముల సీలింగ్ చట్టం క్రింద నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలోని హరిజన అరుంధతీయవాడలో దళితులకు ఇందిరాగాంధీ 40 మందికి సుమారు పది ఎకరాల భూమి ఇచ్చింది. అయితే 2019 జనవరి వరకు ఆ భూములు నెల్లూరు జిల్లా ఆర్ డి ఓ పేరుపై ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలు ఇవ్వాలని వారు గత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. టిడిపి ప్రభుత్వం ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలను ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దామరమడుగు గ్రామంలో లో చుట్టూ పక్కల ఎక్కడ భూములు తక్కువ ధరలు లేనందువల్ల ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, అధికారులు కన్ను దళితుల భూములు పై పడింది. లాక్ డౌన్ కు ముందు తమ భూముల అమ్మే ప్రసక్తే లేదంటూ వారి తిరగబడ్డారు. లాక్ డౌన్ అనంతరం మరల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. మీరు కనుక భూములను అమ్ముకుంటే మీ అకౌంట్లో డబ్బులు వేసి ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడతాను అంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు బెదిరిస్తున్నారు అంటూ దామరమడుగు మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఈ విషయం పై చర్చించి తమకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. తమకు మాత్రం అన్యాయం జరుగుతుంటే రానున్న కాలంలో తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.