విజయనగర చరిత్ర రచనపై తిరుగులేని ముద్ర వేసిన వ్యక్తి మన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఆసూరి రంగస్వామి సరస్వతి. వీరు నేలటూరు వెంకరమణయ్య కంటే ముందే చరిత్ర పరిశోధనలో విశేష అనుభవాన్ని గడించారు. వీరి పరిశోధన ఫలాలు ఇప్పటికి ఎంతోమందికి మార్గదర్శకం అవుతున్నాయి. నెల్లూరు రంగనాయకుల పేట స్థానికుడు కాబట్టి ఆయన్ను రంగనాధ సరస్వతిగా పిలిచేవారు. పేరుకు తగ్గట్టు సరస్వతి పుత్రుడుగా చరిత్ర రచనలో మేధావిగా పేరు గడించారు.
భారతీయ పురావస్తు శాఖలో సహాయ ఎపిగ్రాఫిస్టుగా పనిచేసిన ఆసూరి సరస్వతి రంగస్వామి అయ్యంగార్, నెల్లూరు పట్టణంలోని రంగనాయకుల పేటలో 17-6-1892 వ సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి ఆసూరి సరస్వతి నరసింహాచార్యులు చాలా సంవత్సరాలు నెల్లూరులోని vr హైస్కూలులో తెలుగు టీచర్ గా పనిచేశారు. వీరి పూర్వీకులు మద్రాసులో రామాయణ మహాభారతాల్లాంటి ఉద్గ్రంథాలను అచ్చు వేయించారు. వడగలి శ్రీవైష్ణవులు అయిన రంగస్వామి స్వమతాభిమానంపైన మక్కువ కలిగి ఉండేవారు
వీరు నెల్లూరు వేంకటగిరి రాజా హైస్కూలులో ప్రారంభిక విద్య చదివి, మద్రాస్ పచ్చయప్ప కాలేజీలో బి.ఏ పూర్తి చేశారు. తెలుగు, తమిళము, సంస్కృతంనందు ఆపారానుభవం గడించారు. బి.ఏ తరువాత హిస్టారికల్ రీసెర్చ్ స్టూడెంట్ గా, మద్రాస్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కృష్ణస్వామి అయ్యంగార్ పంచన చేరారు. కృష్ణస్వామి తాను రచించిన విజయనగర చరిత్ర ( sources of vijayanagara history) అనే గ్రంధములో రంగస్వామి ప్రతిభ గురించి గొప్పగా చెప్పారు. వాస్తవానికి ఈ పుస్తక రచన మొత్తం రంగస్వామి పరిశోధనా కష్టంనుంచి జాలువారింది. పేరు మాత్రం కృష్ణ స్వామికి దక్కింది. ఇలాంటి ఘోస్ట్ రైటర్లు నేడు మన నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. ఒకరి పరిశోధనా కష్టాన్ని మరొకరు తమ ” స్వంత రచనలవలె రాసుకోవడం “, నిజమైన హక్కుదార్లను ఎక్కడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమైన విషయం. ఈ మధ్య కాలంలో ఇది సాంప్రదాయంగా మారింది.
యూనివర్సిటీ రీసెర్చ్ స్టూడెంట్ గా అనుభవం గడించిన తరువాత మద్రాస్ ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ లో సహాయకుడిగా రంగస్వామి ఉద్యోగం పొందారు. వీరి ఆధ్వర్యాన ఎన్నో చారిత్రకాంశాలు వెలుగు చూశాయి. నాగార్జున కొండ భౌద్ధ స్థూపములకు సంభందించి వీరు అపారకృషి చేశారు. వాజ్మయ ప్రకరణములే గాక మతాచారా విషయ గ్రంధములు, స్మ్రతి నిబంధన గ్రంధములు, చిత్రలేఖనం, శిల్ప గ్రంధములను పరిశోధించేవారు. శివతత్వ రత్నాకరం, విష్ణుధర్మములోని చిత్రలేఖనంపై గ్రంధము రచించారు.
Mythic society journal, asiatic societry journals లో గొప్ప వ్యాసాలు రాసారు. 1) వసుబంధువు సుబంధువు ఒక్కరా, వేర్వేరు పురుషులా, 2) బోధాయనుడు, ఉపవర్షుడు 3) కృష్ణదేవ రాయుడి రాజనీతి సూత్రాలు మొదలగు విషయాలపై వ్యాసములు రాసి ఉన్నారు. కలకత్తా ఓరియంటల్ కాన్ఫెరెన్స్ లో పరిశోధనా వ్యాసాలు రాశారు. ప్రాచీన ద్రావిడ ప్రౌడకావ్యమగు ‘మణిమేఖల’ లోని ప్రమాణాలను ఉదాహరించారు.
మంచి వక్త కావడం చేత ఇష్టాగోష్టిలను రసవత్తరంగా నడిపించేవారు. పాతవారు కొత్తవారనే భేదంలేకుండా కలుపుగోలుతనంగా ఉండేవారు. పురాణ ఇతిహాసముల, ఉదాహరణములతో మనోహరంగా ప్రసంగించేవారు. శ్రోతలు వీరి ప్రసంగాలపై ఎంతో మక్కువ చూపేవారు. శారీరకంగా బలహీనులు కావడంచేత ఎక్కువగా రోగగ్రస్తులు అయ్యేవారు. పైగా పరిశోధనలు అంటూ ప్రయాణాలు చేయడం మూలాన వీరి ఆరోగ్యం చెడి కొన్ని నెలలు మద్రాస్ జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చివరకు జులై, 11 1934 మరణించారు. అసూరి సరస్వతి రంగస్వామి అయ్యంగార్ పేరే గాకుండా రంగనాధ సరస్వతిగా, ఆసూరి సరస్వతిగా వీరిని పిలిచేవారు. నెల్లూరు జిల్లాలో ఎవరికి పెద్దగా తెలియకుండానే తన చివరిరోజులు గడచినట్టుగా సుభోధిని పత్రికలో వీరి గురించి పెద్ద వ్యాసాన్ని ప్రచురించారు.