వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: తిమ్మిడి హనుమంతరావు
తిప్పారెడ్డిగూడెం, సెప్టెంబర్ 13: వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) నాయకుడు, ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, తరచూ విద్యుత్ కోతల కారణంగా బావులు, బోర్ల ద్వారా సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు నిరంతర విద్యుత్ మరింత అవసరమన్నారు.
అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు రోడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. దోమల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు, ఏఐయూకేఎస్ మండల అధ్యక్షుడు మండల వెంకటేశ్వర్లుతో పాటు పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు.


