గీతం యూనివర్సిటీ నుండి హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ అందుకున్న డా. ఆర్.వి.ఆర్.కు బిల్డర్స్ అసోసియేషన్ ఘన సత్కారం

విశాఖపట్నం, సెప్టెంబర్ 15
భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి సందర్భంగా నగరంలోని ఎంఆర్‌సి కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే–2025ను ఘనంగా జరిపారు. వివిధ రంగాల ఇంజినీర్లు, బిల్డర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రాధ్యక్షులు డా. రాయల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.
గీతం యూనివర్సిటీ ఇటీవల ఆయనకు ప్రదానం చేసిన హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.Litt.) డిగ్రీను గుర్తుచేసుకుంటూ ఈ గౌరవం అందజేశారు.
డా. ఆర్.వి.ఆర్. రహదారులు, వంతెనలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల మౌలిక వసతులు వంటి అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, ఇంజినీరింగ్ రంగంలో తన ముద్ర వేశారు. బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాణ్యత ప్రమాణాల పెంపు, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు.
వృత్తిపరమైన కృషితో పాటు ఆయన సామాజిక సేవలలోనూ ముందుంటారు. విద్యారంగానికి తనవంతు సహకారం అందిస్తూ అనేక పాఠశాలలకు సదుపాయాలు కల్పించడం, వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, లైబ్రరీలు స్థాపించడం వంటి పనులు చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంలో ముందుండి సహాయం చేశారు. పేదవారికి ఆరోగ్య శిబిరాలు, వైద్య సహాయం అందించడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని సభలో పలువురు పేర్కొన్నారు.
“ఇంజినీర్లు సమాజ శిల్పులు” – బ్రిగ్. సుశిల్ కుమార్
ముఖ్య అతిథిగా హాజరైన బ్రిగేడియర్ సుశిల్ కుమార్ (డీడీజీ & సీఈ, డైరెక్టర్ జనరల్ నావల్ ప్రాజెక్ట్స్, విశాఖపట్నం) మాట్లాడుతూ –
“ఇంజినీర్లు కేవలం ప్రాజెక్టులు నిర్మించేవారు కాదు, వారు సమాజ అభివృద్ధికి పునాదులు వేస్తారు. ఆర్.వి.ఆర్. తన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి” అన్నారు.
బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నవనీత్, హానరరీ సెక్రటరీ ఎం.ఎన్. మూర్తి మాట్లాడుతూ –
“ఆర్.వి.ఆర్. వృత్తిపరంగా మాత్రమే కాకుండా, సామాజికంగా కూడా ఎన్నో ముద్రలు వేశారు. ఇలాంటి వ్యక్తులే విశ్వేశ్వరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు” అని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పలువురు ఇంజినీర్లు, విద్యావేత్తలు, ప్రతినిధులు ఆర్.వి.ఆర్. చేసిన వృత్తిపరమైన కృషి, సామాజిక సేవలను కొనియాడారు. అనంతరం విందుతో కార్యక్రమం ముగిసింది.


1 Comment
REDDI SURYANARAYANA
September 15, 2025విజయనగరం జిల్లా విజనగరి గ్రామంలో గ్రామీణ విద్యార్థులకు పాఠశాల భవనం వసతి డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసిన ఆయన సేవకు వందనాలు