చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక దాడిని, ఆయన హత్యను జే.డీ.ఆర్.ఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మారంపూడి సోమరాజు తీవ్రంగా ఖండించారు.
మంగళవారం రాజమండ్రి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో వెంటాడి అత్యంత కిరాతకంగా హత్య చేయడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గంధం చెట్ల అక్రమ రవాణాపై ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు దారి తీసాయని అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


