రైతులకు న్యాయం చేయాలి – కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల విషయంలో కలెక్టర్‌కు వినతి చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి
పున్నమి న్యూస్
29మే 2026
తెలంగాణ ఇంచార్జి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా:
కోహెడ గ్రామ పరిధిలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన, ప్రభుత్వం పేద రైతుల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం ఇప్పటికే కేటాయించిన భూములు ఉన్నప్పటికీ, వాటిని పక్కనబెట్టి ప్రస్తుతం కోహెడ గ్రామంలోని సర్వే నంబర్ 167/1లో సుమారు 264 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ భూములపై ఆధారపడి సుమారు 160 మంది రైతు కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ రైతులు తమ భూములు కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలను నాశనం చేయకూడదని, రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా రైతులకు సరైన నష్టపరిహారం, పునరావాసం, కుటుంబ భద్రత కల్పించాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి కలెక్టర్‌ను కోరారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.
అదేవిధంగా, వచ్చే నెల 03వ తేదీన ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆలోపు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న అమాయక రైతులపై అరెస్టులు, బెదిరింపులు, ఒత్తిళ్లు, దాడులు వంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కోహెడ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.




