నెల్లూరు, అక్టోబర్ 22 (పున్నమి విలేకరి): దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెల్లూరు జిల్లా పై పూర్తి ప్రభావాన్ని చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా రెండు రోజు లుగా ఎడతెరిపి లేని మోస్తారు వర్షాలు కురుస్తు న్నాయి. గత రాత్రి నుంచి తీర ప్రాంతంలోని దాదాపు 10 మండలాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నెల్లూరు నగరం సహా గూడూరు, కావలి, సూళ్లూరుపేటలలో వర్షం కురిసింది. శివారు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రత్యేకించి నెల్లూరు నగరంలోని కొత్తూరు కాలని, వైఎస్‌ఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీ, బిఎంఆర్ నగర్, బుజబుజనెల్లూరు, భగత్‌సింగ్ కాలని సహా పల్లపు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాలువలు పొంగి ప్రవహిస్తు న్నాయి. దాంతో వర్షపు నీరు మొత్తం ఇళ్లలోకి చేరుతోంది. ఇందిరమ్మ కాలనీ, బుజబుజ నెల్లూరులో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షా లతో చిన్నాపెద్దా చెరువులు, రిజర్వాయర్‌లలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. ఇప్పటికే సోమశిల జలాశయంలో 74 టిఎంసిల నీటిమట్టం కొనసాగుతుండగా, కనిగిరి, సర్వేపల్లి, అల్లూరు, నెల్లూరు, చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలలో 1 నుంచి 3 టిఎంసీల నీటిమట్టం చేరువైంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రధానమైన నదులు, ఏరులలో నీటి ప్రవాహం మొదలైంది. కండలేరు, కైవల్య, కాళంగి, స్వర్ణముఖి, బొగ్గేరు, బీరాపేరు, కేతామన్నేరు, పిల్లాపేరులలో నీటి ప్రవాహం మొదలైంది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో కావలి నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న 11 మండలాలలో అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తీరప్రాంతాల మండలాల అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Also read నెల్లూరు-కేంద్రంగా-ఇసుక