దుమ్ము–ధూళితో ప్రజల అవస్థలు.. ఆర్డీవోకు సీపీఎం నేతల వినతి
ఆత్మకూరు, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో)కు వినతిపత్రం సమర్పించారు.బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రహదారిపై మట్టి, ఇసుక పేరుకుపోయి వాహనాల రాకపోకల సమయంలో పెద్దఎత్తున దుమ్ము–ధూళి ఎగసిపడుతోందని తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, రహదారి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.రోడ్డు పనులు వెంటనే పునఃప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని, అప్పటివరకు క్రమం తప్పకుండా నీటిని చల్లాలని కోరారు. రహదారిపై పేరుకుపోయిన మట్టి, ఇసుక, నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు రాత్రివేళ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పనులు ఎందుకు నిలిచిపోయాయో ప్రజలకు వివరించి, పూర్తి చేసే గడువును ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, పార్టీ నాయకులు వసీం, కృష్ణమోహన్, రమణయ్య, మాల్యాద్రి, పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.


