ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో రూ.46.80 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రారంభించారు.
అదే సమయంలో కొత్తపల్లి ఎస్టీ కాలనీలో 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాలను 32 మంది లబ్ధిదారులకు చీర సారెలతో కలిసి అందజేశారు. వరదల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎస్టీ కుటుంబాలకు మౌలిక వసతులు, పక్కా ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తరువాత ఎస్టీ సోదర సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు, కంభం విజయరామిరెడ్డి బంతి భోజనం చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.



