ప్రభుత్వ భూములపై కబ్జాకోరుల పంజా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి?
తెలంగాణ/ఖమ్మం జిల్లా: పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం సిటీ : ఖమ్మం నగరం ఇప్పుడు కబ్జాదారుల రాజ్యంగా మారుతోందా? కోట్ల విలువైన ప్రజా ఆస్తి రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తుల పరమవుతుంటే యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది స్థానికుల నుంచి. గత రెండేళ్లుగా నగర పరిధిలో ప్రభుత్వ భూములు, NSP ల్యాండ్లు, చెరువు శిఖాలు, ఓపెన్ ప్లాట్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నా.. రెవెన్యూ, మున్సిపల్, అధికారులు చూస్తూ ఊరుకోవటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికలొస్తే చాలు.. ప్రభుత్వ భూములను కాపాడతాం.. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతాం” అని హామీలు గుప్పించే రాజకీయ నాయకత్వం.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కాక ఎందుకు మౌనం వహిస్తోందని నగర ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ భూ ఆక్రమణల వెనుక అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు కీలక నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నాయి……
ఖమ్మం నగరంలో ఎక్కడెక్కడ కబ్జాలు…
నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో, కబ్జాదారులు విలువైన ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఉన్న కొన్ని ప్రధాన ప్రాంతాల వివరాలు ఒక్కసారి చూస్తే రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో 192 సర్వే నెంబర్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో , ప్రస్తుత ప్రభుత్వంలో నాయకులు పూర్తి స్థాయిలో ప్లాట్లుగా విభజించి అమ్ముకుని కోట్లకు పడగెత్తిన అందరికి తెలిసిన విషయమే…అంతే కాకుండా స్థానిక గొల్లగూడెం రోడ్డులో ఇరిగేషన్. శాఖకు చెందిన అత్యంత విలువైన NSP (నాగార్జునసాగర్ ప్రాజెక్ట్) ల్యాండ్స్‌పై కబ్జాదారుల పంజా పడింది.అదే విధంగా 20వ డివిజన్ (హార్వెస్ట్ స్కూల్ వెనుక): ఇక్కడ అధికార పార్టీ నాయకుల అక్రమాలు పరాకాష్టకు చేరాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడమే కాకుండా.. ఒక్కో ప్లాట్‌కు రూ. 1,50,000 వరకు వసూలు చేస్తూ యథేచ్ఛగా కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి,ఒక విధంగా చెప్పాలంటే రాత్రికి రాత్రే బోర్డులు మారుతున్నాయి..స్థానికుల కథనం ప్రకారం.. పగలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, రాత్రి అయ్యేసరికి సీన్ మారుతోంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు వేయడం, జెండాలు పాతడం, లేఅవుట్లు గీయడం జరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల భారీగా మట్టి పోసి భూ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. నిన్నటివరకు “ప్రభుత్వ భూమి” అని ఉన్న బోర్డులు మాయమై.. తెల్లవారేసరికి “ప్రైవేట్ ప్రాపర్టీ” అనే బోర్డులు వెలుస్తుండటం గమనార్హం…..
పంచాయతీ ఆఫీస్ స్థలానికే ‘హౌస్ నంబర్’.. అధికారుల లీలలు!
ఇదిలా ఉండగా, గొల్లగూడెం పంచాయతీ ఆఫీస్ స్థలానికి సంబంధించిన కొత్త వివాదం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. 2012 వ సంవత్సరంలో ఒక లేఅవుట్ లో గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పంచాయతీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో అనాటి మంత్రి నేటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన,ప్రారంభోత్సవం జరిగింది, ఇప్పటికీ ఆ స్థలంలో శిలాఫలకం ఉంటుంది కానీ ఆ ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్ అధికారులు అక్రమంగా ఒక ప్రైవేట్ వ్యక్తి పేరిట ‘హౌస్ నంబర్’ జారీ చేశారనే వార్త కలకలం రేపుతోంది.ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టేందుకు, భవిష్యత్తులో అది ప్రైవేట్ ఆస్తిగా నిరూపించుకునేందుకు వీలుగానే అధికారులు ఈ అక్రమ హౌస్ నంబర్లకు తెరలేపారనే విమర్శలు వస్తున్నాయి. “ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే ఇలా దొంగ సర్టిఫికెట్లు, హౌస్ నంబర్లు ఇస్తూ పోతే.. ఇక భూములను కాపాడేది ఎవరు?” అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.మున్సిపల్ , రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నిలువ నీడ లేక రోడ్డు పక్కన లేదా ఖాళీ స్థలంలో చిన్న గుడిసె వేసుకునే పేదవాడిపై సిబ్బందితో దాడి చేయించి, వెంటనే ఖాళీ చేయించే అధికారులు.. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గుటకాయస్వాహా చేస్తున్న బడా బాబులు, రాజకీయ ప్రభావశీలుర వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న రహస్యమేమిటి? అధికారుల ఈ మిన్నకుండిపోవడం వెనుక కేవలం రాజకీయ ఒత్తిళ్లే ఉన్నాయా.. లేక కోట్ల రూపాయల చేతులు మారిన ‘భూ మాఫియా’ నెట్‌వర్క్ పనిచేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….
అధికారులు ఇప్పటికైనా మేల్కొనకపోతే అంతే సంగతులు..!
ఖమ్మం నగరంలో భూముల దోపిడీ ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, బడులకు, ఆసుపత్రులకు లేదా పార్కులకు కనీసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కూడాఒక్క అడుగు భూమి కూడా మిగలదని పౌర సమాజం హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.“ప్రభుత్వ భూములను కాపాడండి… భూ మాఫియాను అరికట్టండి” అంటూ ఖమ్మం నగరం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఇకనైనా పాలకులు, అధికారులు కదలుతారో లేదో చూడాలి…..


