హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజలకు మరో కీలక పౌర సేవను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే అధికారిక పత్రంలో పొందుపరిచే **‘ఫ్యామిలీ సర్టిఫికెట్’**ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల కుటుంబ వివరాలు ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని భట్టి తెలిపారు. ఈ వివరాలను ప్రజలకు అధికారికంగా అందించేందుకు తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు చెప్పారు.
విద్య, ఉద్యోగాలు, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణకు ఈ సర్టిఫికెట్ అధికారిక పత్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

