కొవ్వూరు గామన్ వంతెన వద్ద 40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత?
సుమారు రూ.20 లక్షల విలువైన బియ్యంతో లారీ స్వాధనం.
తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు (పున్నమి ప్రతినిధి): పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోంది. కొవ్వూరు గామన్ వంతెన సమీపంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీ పట్టుబడింది. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి లారీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అధికారుల తనిఖీలు అప్పుడప్పుడు తూతూమంత్రంగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక లారీ పట్టుబడుతున్న సమయంలోనే మరోవైపు పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పేదల బియ్యం అక్రమ వ్యాపారానికి తరలిపోతున్నా దందాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, కేవలం లారీలు పట్టుకోవడంతో సరిపెట్టకుండా ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

