పెదపూడి, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): పెదపూడి 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమై ఆసుపత్రిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆర్‌ఐడీఎఫ్ కింద మంజూరైన భవన ఆధునీకరణ పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రుల ఆధునీకరణ, అవసరమైన వైద్య సదుపాయాల కల్పన, రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 65 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, అధికారులు, పెదపూడి మండల నాయకులు పాల్గొన్నారు.



