పుణ్యక్షేత్రాలు
రంగనాథస్వామి(పల్లికొండ నాథుడు) దేవాలయం : దేశంలోని ప్రముఖ దేవాలయాలు నదీమ తల్లుల ఒడ్డున వెలసివున్నాయి. అలాగే నెల్లూరు లోని రంగనాథ స్వామి (రంగపెరుమాళ్) దేవాలయం పెన్నానది ఒడ్డున వుంది. ఇది అతి ప్రాచీనమైన వైష్ణవాలయం.
నెల్లూరు కాపులు (ఇక్కడ రెడ్లను కాపులంటారు) ఏడవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది.
ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినది. దాదాపు వెయ్యి సంవత్సరాలక్రితం నిర్మి తమైనట్లు తెలుస్తుంది. సోమశిల నిర్మాణం కాకముందు పెన్నకు వరదలు వచ్చిన పుడు దేవాలయంలోకి నీరు వచ్చేది. ఏడు అంతస్తులతో 29 మీటర్ల ఎత్తు గలిగిన గాలిగోపురం భక్తకోటిని ఆకర్షిస్తుంది. ఈ గాలి గోపురాన్ని 1859 ప్రాంతంలో మహాభక్తులు యరగుడిపాటి వెంకటాచలం పంతులు నిర్మించారు. ఈ గాలి గోపురం మధుర, చిదంబరం, కంచి వంటి తమిళనాడు దేవాలయాలను తలపిస్తుంది.
ఇక్కడ రంగనాథస్వామి వారు తలక్రింద కుంచం పెట్టుకొని శయనించి వుంటారు. కనుక తల్పగిరి రంగనాధస్వామిగా ప్రసిద్ధి చెందారు. భూదేవి, శ్రీదేవి స్వామివారి పాదాలొత్తుతూ వుంటారు. నెల్లూరు సీమ వరి పంటకు ప్రసిద్ధి చెందింది. పండిన ధాన్యాన్ని కొలిచి, కొలిచి కలిగిన శ్రమవల్ల సేదతీరుతున్నారని చెపుతారు. దేవాలయ ప్రాంగణములో 1928లో భక్తుడు ముప్పిరాల చినవెంకట నరసింహాచార్యులు నిర్మించిన అద్దాల మంటపం చూపరుల నాకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో తిరునాళ్లు వైభవంగా జరుగుతుంది. గరుడసేవ, రథోత్సవం రోజున భక్తులు క్రిక్కిరిసి వుంటారు. రంగనాధ స్వామి ఆలయం వుండే ప్రాంతాన్ని రంగనాయకులపేట అని, గోపురానికి ఎదురుగా వున్న వీధిని గోపురంవీధి అని పిలుస్తారు.
మూలస్థానేశ్వరస్వామి దేవాలయం : నెల్లూరు మూలాపేటలో ఈశ్వరాలయం వుంది. ఇది ప్రాచీన దేవాలయం. దీన్ని మూలస్థానేశ్వర దేవాలయం అంటారు. ఉసిరిక చెట్టు క్రింద స్వయంభువుగా శివలింగం కనిపిస్తే అక్కడ శివాలయం నిర్మించా రని చెపుతారు. ఇందులో వేణు గోపాలస్వామి విగ్రహం కూడ వుండడం విశేషం. మూల స్థానేశ్వరుడు పేరు మీదుగానే ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. నిత్యం భక్తులు వస్తుంటారు. శివరాత్రి ఘనంగా జరుగుతుంది. దీని సమీపంలో వేణుగోపాలస్వామి దేవాలయం వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయం కూడా వుంది. ఈ రెండు దేవాలయాలలో పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. నెల్లూరు సీమవారు పెళ్ళి లగ్నం కుదరగానే దేవాలయ ప్రాంగణాన్ని రిజర్వు చేసుకుంటారు. కళ్యాణ వేదికంటూ వుండాల్సిన అవసరం లేదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వధూవరులను కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు జరుపుతుంటారు. ఇక్కడ పెళ్ళి జరిగితే అంతా శుభమే జరుగుతుందని ఈ సీమ ప్రజల పరిపూర్ణ విశ్వాసం.
కన్యకా పరమేశ్వరి దేవాలయం : నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో కన్యకా పరమేశ్వరి ఆలయం వుంది. ఆర్య వైశ్యులు పరమేశ్వరి అమ్మవారిని తమ కుల దేవతగా ఆరాధిస్తారు. భక్తుల విరాళాలతో దేవాలయం నిర్మించారు. దేవీ శరన్నవరాత్రి వుత్సవాలను చాల వేడుకగా నిర్వహిస్తారు. పెళ్ళి కాని యువతీ యువకులు ఇక్కడ దేవాలయంలో ‘వరమాల’ కట్టి పూజలు చేస్తారు. ఈ విధంగా చేస్తే త్వరగా వివాహం నిశ్చయవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆంజనేయస్వామి గుడి : నెల్లూరు నగరానికి నడిబొడ్డున రాయాజీవీధిలో ఆంజనేయస్వామి దేవాలయం వుంది. నిత్యం స్వామి వారిని భక్తులు దర్శించుకొంటారు. పూజాదికాలు నిర్వహిస్తుంటారు.
ఇస్కాన్ మందిరం (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) : శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచ సమాజానికి తెలియపరచి ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించడానికి దేశ విదేశాలలో కృష్ణ మందిరాలు నెలకొల్పారు. స్థానికంగా నెల్లూరులో కొండాయపాళెం రోడ్డు ప్రాంతంలో రాథాకృష్ణ మందిరం 1996లో నిర్మించారు. వీరి ఆధ్వర్యంలో 2012 నుండి ఏటా జనవరిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు.
సాయిబాబా గుడి :
నెల్లూరులో సాయిబాబా మందిరాలు చాలానే వున్నాయి. మొదటిదిగా డాక్టరు రాజగోపాలాచార్లు రాయాజీ వీధిలో చిన్నగుడి నెలకొల్పి రేబాల లక్ష్మీనరసారెడ్డి ఆర్ధిక సహకారంతో నిర్వహించారు. నెల్లూరు ప్రజలకు ‘సాయిబాబా’ ఎవరో తెలియని రోజుల్లో సాయిభజనలు ప్రారంభించి, సాయి ఎఱుక కలిగించారు. రోగులకు వైద్యంతో పాటు విభూతి ఇచ్చేవారు. అటు తర్వాత కోఆపరేటివ్ బ్యాంకు సమీపంలోని బాబా గుడి నిర్మింపబడింది. 1956లో నిర్మాణం మొదలుపెట్టి 1958 అక్టోబరు నెలలో విజయదశమి రోజున మందిరం ప్రారంభమైంది. భక్తులతో నిత్యం రద్దీగా వుంటుంది. నెల్లూరు నడిబొడ్డున మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహనీయులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ డానికి, భక్తులు కూర్చోడానికి అనువుగా పైఅంతస్తు నిర్మాణం జరిగింది. పిల్లలపార్కు సమీ పంలోని సాయిసదన్, పద్మావతి నగర్‌లోని సాయిదర్బార్ అద్దాల మందిరం, మినీబైపాస్ రోడ్డులో జేమ్స్‌గార్డెన్ ప్రాంతంలోగల సాయిబాబా మందిరం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని సాయిబాబా దేవాలయం ప్రసిద్ధమైనవి. పొదలకూరు, గూడూరు పట్టణాలలోను ఆధ్యాత్మికత పరిఢవిల్లే సాయిబాబా మందిరాలు నిర్మితమై వున్నాయి.
సత్యసాయిబాబా మందిరం : నెల్లూరులో రామమూర్తినగర్ ప్రాంతంలో సత్యసాయి భజన మందిరం నిర్మితమైంది. బాబా జన్మదినం తదితర వేడుకలు ఘనంగా జరుపుతారు. ప్రతి గురువారం భజన కార్యక్రమాలు వుంటాయి. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం : నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ప్రధాన రహదారి ప్రక్కనే వున్న అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకతో జరుగుతాయి. విద్యుద్దీపాలతో మెరిసిపోతుంది. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి 1968లో కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారిచే శంకుస్థాపన జరిగింది. 1975లో జయేంద్ర సరస్వతి స్వాములవారు, శృంగేరీ పుష్పగిరి పీఠాధిపతి స్వాముల వారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నేడు అత్యంత వైభవోపేతమైన దేవాలయంగా వెలుగుతుంది. దేవాలయానికి అనుబంధంగా వున్న కల్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలు జరుపు కొంటారు. ఆలయాన్ని స్వర్గీయ రత్నసాయి మొదలియార్ నిర్మించారు. వీరు తమిళనాడు నుండి వచ్చి నెల్లూరులో స్థిరపడినవారు.
అయ్యప్ప స్వామి గుడి : నెల్లూరులో వేదాయపాళెం సమీపంలో వున్న దేవాలయం. 1987లో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రజలు అపార విశ్వా సంతో వుంటారు. భక్తులు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల ధరిస్తారు. నల్ల బట్టలు ధరించి చాల నియమ నిష్ఠలతో వుంటారు. 41 రోజుల దీక్ష చేస్తారు. కేరళలోని శబరిమలకు వెళ్ళే భక్తులకు గుడి యాజమాన్యం వారు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. డిసెంబరు, జనవరి మాసాలలో స్వామివారి గుడిని విద్యుద్దీపాలతో వైభవంగా అలంకరిస్తారు. శబరిమల వెళ్లే భక్తులు నవంబరు నెల మధ్య నుండి ప్రయాణ సన్నాహాలలో వుంటారు.
భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి మందిరం : నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో నాగులవెల్లటూరు గ్రామంలో జన్మించిన వెంకయ్య స్వామి 1982 ఆగష్టు 24న గొలగమూడిలో మహాసమాధి చెందారు. అక్కడ మందిర నిర్మాణం జరిగింది. ఇది నెల్లూరుకు 15 కి.మీ. దూరంలో వెంకటాచలం మండలంలో వుంది. వీరు భగవాన్ వెంకయ్యస్వామిగా, అవధూతగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజ మాష్టారు, మాకాని వెంకట్రావు వంటి మహనీయులు వెంకయ్యస్వామిని భగవత్ స్వరూపులుగా భావించి ఆరాధించారు. వెంకయ్యస్వామి ఈతాకు చాపమీద కూర్చొని, శరీరంపై కౌపీనం (గోచిగుడ్డ) తప్ప మరే ఆచ్ఛాదన లేకుండా తంబూర వాయించుకొంటూ కాలం గడిపే వారు. ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి. ఆపదలో వున్న వారిని ఆదుకోండి. ‘పావలా దొంగలిస్తే పది రూపా యలు పోతాయి’ అని చెప్పేవారు. ఈ మాటల ద్వారా ఆర్తులకు సహా యపడమని, అన్యాయార్జితం కూడదని, ఇతరుల సొత్తు నాశించరాదని యుగాలకు సరిపోయే సందేశమిచ్చారు. నేడు ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఆశ్రమపాఠశాల స్థాపించారు. వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన యాత్రా స్థలంగా పేరుపొందింది. ఏటా ఆగష్టు నెలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
గాలిపాలెం చిన వెంకయ్యస్వామి : చేజర్ల మండలంలోని గాలిపాలెం ప్రాంతం 1987కు ముందు దాదాపు జనసంచారం లేని ప్రదేశం. అక్కడ శ్రీహరి అనే పశువుల కాపరి ఒక పాకలో శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి పటాన్ని పెట్టుకొని పూజ చేసేవారు. కొద్ది కాలానికి ఒక చిన్న ఆశ్రమం ఏర్పడింది. గ్రామస్తులు రావడం, ప్రార్థించినవారి కోర్కెలు తీరుతుండడంతో ఆశ్రమ ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న భక్తుల విరాళాలతో క్రమంగా తొమ్మిది ఆలయాల సముదాయం ఏర్పడింది. నేడు ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరు పొందింది. భగవాన్ వెంకయ్యస్వామివారి పీఠం ఏర్పరచి ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి’ అనే సూక్తిని ఇక్కడ ఆచరణలో పెడుతున్నారు. ఆలయ ప్రాంతమంతా ‘ఓం నారాయణ, ఆదినారాయణ’ మంత్రంతో మారుమ్రోగు తుంటుంది. ఏటా మూడు రోజులు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీహరి చిన వెంకయ్యస్వామివారికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం : దక్షిణ భారత దేశంలో కంచి కామాక్షి దేవాలయం ప్రసిద్ధి చెందినది. జొన్నవాడను రెండవ కాంచీపురంగా పిలు స్తారు. ఇది నెల్లూరుకు 12 కి.మీ. దూరంలో వుంది. కామాక్షి అమ్మవారుగా ప్రసిద్ధి చెందింది. బుచ్చిరెడ్డిపాళెంకు దగ్గరగా పెన్న ఉత్తరతీరాన ఈ పుణ్యక్షేత్రంలో మల్లికార్జునుడు (ఈశ్వరుడు), కామాక్షి అమ్మవారు (పార్వతీ దేవి) కొలువై వున్నారు. శ్రీశైలక్షేత్రంతో సమానంగా వెలుగుతోంది. నిత్యం భక్తులతో ప్రత్యేకించి మహిళా భక్తులతో నిండి వుంటుంది. గ్రహపీడి తులకు స్వాంతన చేకూర్చే సన్నిధిగా పేరుంది. భక్తుల కోరికలు తీరుతుంటాయని, సంతానం కలగాలని అమ్మవారికి మొక్కుకుంటారు. ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
పెంచలకోన : రాపూరు మండలంలో అడవి ప్రాంతంలో గోనుపల్లి గ్రామం దగ్గరగా దేవాలయం వుంది. పెనుశిల నరసింహ స్వామి దేవాలయం క్రమంగా పెంచలకోనగా మారింది. ఎ.సి.సుబ్బారెడ్డి మంత్రిగా వున్న సమయంలో ఆలయ అభివృద్ధి, రోడ్డు నిర్మాణం, సింహద్వార స్థాపన, నిత్యపూజ ఏర్పాట్లు జరిగాయి.
హిరణ్యకశిపుడనేరాక్షస రాజును మహావిష్ణువు ఉగ్ర నరసింహావతార మెత్తి సంహరిస్తాడు. తర్వాత కూడ ఉగ్రరూపం చల్లారదు. చెంచులక్ష్మి రూపంలో వున్న ఆదిలక్ష్మితో చెలిమి తర్వాత ఉగ్రరూపం చాలిస్తాడు. భక్తుల కోరిక మేరకు పెంచలకోనలో స్వయంభువుగా స్వామివారు వెలిశారని స్థలపురాణం చెపుతోంది. నృసింహ జయంతి పండుగ ఘనంగా జరుపుతారు.
నెల్లూరుకు పెంచలకోన 80 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రాంత వాసులు స్వామివారి పేరుతో పెంచలయ్య, పెంచలమ్మ, పెంచల నరసింహ, పెంచలలక్ష్మి అనే పేర్లు పెట్టుకొంటారు.
పెంచలకోన వెళ్లినవారు అక్కడ వేంచేసి వున్న కరుణామయి విజయేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందుతారు. వారు ఆశ్రమం, జ్ఞానమందిరాన్ని స్థాపించి భక్తులకు బోధనలు చేస్తుంటారు. అమ్మవారిని గొప్ప మహిమ కలిగిన తల్లిగా ఆరాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గదర్శిగానే కాక విద్య, వైద్యం, గృహవసతి వంటి సమాజ సేవలందిస్తూ కరుణామయిగా పేరు పొందారు. రాపూరు మండల ప్రాంత గ్రామీణులు వారిపాలిట కల్పవల్లిగా భావిస్తారు.
వేదగిరి నరసింహస్వామి ఆలయం : నెల్లూరుకు 15 కి.మీ. దూరంలో పెన్న దక్షిణ తీరంలో వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలసి వుంది. కొండ మీద వుండే ఈ ఆలయం పల్లవరాజులు నిర్మిం చారని చెబుతారు. ఏటా మే నెలలో బ్ర¬్మత్సవాలు జరుపు తారు. కొండమీద ఏడు కోనేర్లు వున్నాయి. పురాణగాథó ప్రకారం కశ్యప మహర్షి నాడు యజ్ఞం చేసిన గుండాలే కోనేర్లుగా మారాయని చెపుతారు. యాభై ఏళ్ళ వరకు ఈ స్వామి తిరునాళ్ళకు జిల్లాలోని యాగనాదులందరు వచ్చి ఆరాధించేవారు. మరోపార్శం గురించి చెప్పాలంటే జిల్లాలోని ఏకైక పవన విద్యుత్ ప్రాజెక్టు నరసింహులకొండ మీద వుంది.
చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి : సూళ్ళూరుపేటలో కాళంగి నదీతీరాన అమ్మవారు వెలిసింది. గర్భగుడికి తలుపులు లేకపోవడం విశేషం. ఏ సమయంలోనైనా ఆమెను దర్శించుకోవచ్చు. ఆంధ్రులకు, తమిళులకు ఆరాధ్య దేవతగా వెలుగొందుతోంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. నెల్లూరుకు సుమారు 100 కి.మీ. దూరంలో సూళ్ళూరుపేట వుంది. చెన్నై-కలకత్తా ప్రధాన రహదారి ప్రక్కన ఆలయం వుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి. స్థానికులు గ్రామ దేవతగా కొలుస్తారు. శని, ఆదివారాలలో, ఉగాది వంటి పండుగ దినాలలో భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. ప్రతి ఏటా సూళ్ళూరుపేటలో జాతర, సంత జరుగుతుంది. ప్రతి 7 సంవత్సరాల కొకసారి బ్ర¬్మత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
గండవరం శివాలయం : ఈశ్వరుడు ఉదయకళేశ్వరస్వామి రూపంలో వెలసి వున్నాడు. ఉదయించే సూర్యుని కిరణాలు శివుని పాదాలపై పడతాయని, కనుకనే ఉదయ కళేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఇది ప్రాచీన దేవాలయం. చోళుల కాలంలో నిర్మితమైంది. లింగాకారంలో శివుడు ప్రతిష్ఠితమై వున్నాడు. పార్వతి అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తారు. నవగ్రహ మండపం వుంది. శివరాత్రి ఉత్సవాలు వేడుకగా చేస్తారు. నందిసేవ, తేరు, తెప్ప ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.