ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీఎంఏపి బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అల్లూరి, మన్యం పార్వతీపురం, పోలవరం జిల్లాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి సాగుకు అనువైన భూములు, నీటి వనరులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మునగ, చింత, కరివేపాకు, లెమన్ గ్రాస్, అలోవెరా తదితర మొక్కల సాగును ప్రోత్సహిస్తామన్నారు. రైతుల ఆదాయం పెంచడంతో పాటు మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పిస్తామన్నారు.
పోషణ్ వాటికల ఏర్పాటుకు ప్రోత్సాహం
పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాల్లో పోషణ్ వాటికలు ఏర్పాటు చేసి విద్యార్థులకు తాజా, సేంద్రియ పద్ధతుల్లో పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ, ఉప కలెక్టర్ కె. సాహిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లండన్ బ్రిటన్ పార్లమెంట్ హాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ అవార్డు అందుకున్న చంద్రశేఖర్‌ను అధికారులు సత్కరించారు.

వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన