నెల్లూరు కేంద్రంగా ఇసుకదోపిడీ
బల్క్ ఆర్డర్ల పేరుతో భారీ అక్రమాలు
నెల్లూరు టూ రామాపురం వయా పొదలకూరు
రేవుల నిర్వాహకులే సూత్రధారులు?
ప్రేక్షకపాత్ర వహిస్తున్న నిఘా విభాగాలు.
నెల్లూరు, (పున్నమి ప్రతినిధి) :
ఇసుక… గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఒక అరుదైన వినియోగ వస్తువు. నిర్మాణ రంగానికి మూలపదార్థం. అనేక మంది కార్మికుల నుంచి కార్పొరేట్ స్థాయి వరకు ఉపాధి కూడా. ఇప్పుడది అందని ద్రాక్షలా మారింది కొందరికి. మరికొందరికి ఆయాచిత వరమైంది. నిల్వలు సమ ద్ధిగా వున్నా నదుల వెంట పదుల కొద్ది రేవులున్నా ఇసుక గిరాకి మాత్రం రోజురోజుకి పెరుగుతుంది. ఎందుకీ దుస్థితి… కారకులెవరు… కార్యనిర్వహణలో జరుగుతున్న లోపాలు ఏంటి?
రాష్ట్రం ఇసుక విధానం పై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ రంగాలకు అందుబాటులోకి తేవాలంటూ అనేక మార్పులు చేస్తోంది రాష్ట్రం ప్రభుత్వం ఇసుక విధానం పై.అన్నింటినీ.. అనుకూలంగా మార్చుకొంటున్నారు…అక్రమార్కులు.. ఇసుక రేవులను నిలువుదోపిడీ చేస్తున్నారు.. అందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు… అక్రమార్కులకు అనంత కోటి ఉపాయాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం పై తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు, కఠిన నిబంధనలను సైతం కొందరు అక్రమ మార్గాలకు అడ్డాగా మారుస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఇసుక రవాణా ఇందుకు తార్కాణంగా వుంది. జిల్లాలో 27కు పైగా ఇసుక రేవులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అవసరాల మేరకు ఆన్‌లైన్ ద్వారా సరఫరా చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనినే తమ అక్రమ ఆర్థిక ఆర్జనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు ఇసుక రేవుల నిర్వాహకులు. నెల్లూరు నగర సమీపంలోని పొట్టేపాళెం, జొన్నవాడ, పల్లెపాడు రేవులను దక్కించుకున్న ఓ నిర్వాహకుడు ఏకంగా తన పేరు మీదనే వేలకొద్ది టన్నుల ఇసుకను ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా దొడ్డి దారిన అనుమతులు తీసుకుని కొల్లకొట్టేస్తున్నాడు. ఇసుక రేవును అనుమతి పొందిన వారు వాటిని సరఫరా చేసే బాధ్యతను చేపట్టవలసి వుండగా, ఇక్కడ ఇసుకరేవు నిర్వాహకుడు తన పేరుమీదనే బల్క్‌ఆర్డర్లు పొందారు. ఒక్కో రేవు నుంచి ఉన్నతాధికారుల ద్వారా 5000 టన్నులకు అనుమతి తీసుకుని నా రేవు నా ఇష్టం అన్నట్లుగా మిగిలిన వారికి ఇసుక దక్కకుండా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ నిర్మాణ రంగాల అవసరాలకు ప్రాధాన్యతను ద ష్టిలో ఉంచుకొని బల్క్ ఆర్డర్ల అనుమతికి తెర లేపింది. దీనినే అనుకూలంగా మార్చుకున్న పొట్టేపాళెం, జొన్నవాడల రేవు నిర్వాహకులు బల్క్‌ఆర్డర్‌ల పేరుతో ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించేస్తున్నారు. ఏపీ సరిహద్దులోని తడ మండలం, రామాపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీల పేరుతో 5 వేల మెట్రిక్‌టన్నుల అనుమతి పొంది దొడ్డి దారిన హద్దులు దాటించేస్తున్నారు. రెండు రోజుల క్రితం బల్క్‌ఆర్డర్ల నిర్వాహకులు రవాణా చేస్తున్న భారీ వాహనాలను పొదలకూరు పోలీసులు గుర్తించారు. ఒకవైపు అనుమతి, ఒక చోట సరఫరా మరోచోటికి అన్నట్లుగా అక్రమ రవాణా చేస్తూ దొడ్డి దారిన నెల్లూరు టు రామాపురం, వయా పొదలకూరు అన్నట్లు ఈ సరఫరాను కొనసాగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పల్లిపాలెం, పొట్టెపాళెం, జొన్నవాడ రేవుల నిర్వాహకులు ఒక్కరే కావడంతో వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా తయారైంది ఇసుక రవాణా. సహజంగా జిల్లాలో జరుగుతున్న అభివ ద్ధి పనుల కోసం బల్క్ ఆర్డర్లు పొందిన వారికి ప్రాధాన్యత క్రమం ప్రకారం ఇసుక సరఫరా చేయాల్సి వుంటుంది. అయితే ఆయా రేవుల నిర్వాహకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. నెల్లూరులో జరిగే అభివ ద్ధి పనులకు సుదూర ప్రాంతాల నుంచి ఇసుక అనుమతులు ఇస్తున్నారు. అందులోనూ అయిన వారికి ఆకులో, కాని వారికి కంచాలు అన్నట్లు రీచ్‌లలో లోడుకి లోడు అదనపు సొమ్ము చెల్లించిన వారికి ముందుగా రేవులో లోడింగ్ జరుగుతోంది. అలా కాని వారికి మాత్రం సవాలాక్ష ఆంక్షలు విధిస్తున్నారు ఇసుక సరఫరాకు అనుమతులు పొందిన నిర్వాహకులు.
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అభివ ద్ధి పనులు జరుగుతుండడం, నిర్మాణ రంగం వేగవంతం కావడంతో ఇసుకకు పెద్ద ఎత్తున గిరాకి ఏర్పడింది. ఇటీవల ఇసుక విధానంలో నెలకొన్ని గందరగోళం నేపథ్యంలో ఇక్కడ రేవుల నిర్వాహకులు దానిని రూపాయికి రూపాయి అదనం అన్నట్లుగా క్యాష్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. వాస్తవంగా శ్రీసిటీలో అభివ ద్ధి పనులు వేల కొద్ది టన్నులు జరుగుతున్నా సమీపంలోని స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి సరఫరా చేసుకునే అవకాశం వుంటుంది.అయితే ఇక్కడి నిర్వాహకులు మాత్రం నెల్లూరులో అభివ ద్ధి పనులకు మాత్రం స్వర్ణముఖి, సూళ్లూరుపేటల నుంచి అనుమతులుఇస్తున్నారు.అక్కడి అభివ ద్ధి పనులకు నెల్లూరు నుంచి ఇసుక సరఫరాకు అనుమతులు తెస్తున్నారు. అందులోను నెల్లూరు నుంచి ఏపీ తమిళనాడు సరిహద్దులో నున్న రామాపురానికి మాత్రమే అత్యధిక స్థాయిలో ఇసుక సరఫరా అవుతుంది. జిల్లా కేంద్రంలో భారీ నిర్మాణాలు కేంద్ర రాష్ట్రప్రభుత్వాల అభివ ద్ధి పనులకు చెందిన ప్రాజెక్టుపనులు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా, వాటికి సరఫరా చేయకుండా ఒక్క రామాపురానికే పెద్ద ఎత్తున బల్క్ ఆర్డర్లు పొందడం ఖచ్చితంగా సరిహద్దును దాటించేందుకేనన్న విమర్శలు, ఆరోపణలున్నాయి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక రవాణా,అనుమతులు, గిరాకిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.