నక్కర్త–మేడిపల్లి నుంచి వరుసగా తరలిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలు..
గ్రామ అభివృద్ధిపై తీవ్ర ఆందోళన
రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని కాపాడుకుందాం.. పోరాడితేనే హక్కులు
గ్రామస్థుల పిలుపు
యాచారం మండలం, నక్కర్త–మేడిపల్లి:
ఒకప్పుడు విద్య, రవాణా, తాగునీరు, ప్రజా సేవలు, ప్రభుత్వ కార్యాలయాలతో కళకళలాడిన నక్కర్త–మేడిపల్లి గ్రామం నేడు ఒక్కొక్కటిగా ప్రభుత్వ సంస్థలను కోల్పోతూ అభివృద్ధికి దూరమవుతోందని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా సేవలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మేడిపల్లిలో ఉన్న హెచ్‌ఎస్‌సీ (ఇంటర్ కళాశాల) ఇతర ప్రాంతానికి తరలిపోవడం గ్రామ విద్యార్థులకు మొదటి పెద్ద దెబ్బగా మారింది. అనంతరం బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ వసతి గృహం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, ఫిల్టర్ ప్లాంట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, 104 ఆరోగ్య సేవలు వంటి కీలక సేవలు కూడా గ్రామం నుంచి వెళ్లిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సుమారు ఆరుగురు ఉపాధ్యాయుల బదిలీలు కూడా విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే కాకుండా, ఒకప్పుడు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడిన మేడిపల్లి నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు, మేడిపల్లి–మాల్, మేడిపల్లి–ఆమనగల్ సహా గ్రామానికి రావాల్సిన దాదాపు పది బస్సు ట్రిప్పులు రద్దు కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి రవాణా సౌకర్యాలు తగ్గిపోవడం వల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే పలు శాఖలు గ్రామాన్ని వీడగా, తాజాగా పోలీస్ స్టేషన్ కూడా తరలిపోయే అవకాశాలు ఉన్నాయనే సమాచారం గ్రామ ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా గ్రామంలో ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) కూడా ఇతర ప్రాంతానికి వెళ్లే అవకాశముందనే ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను కూడా మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తుండటంతో గ్రామ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై గ్రామ ప్రయోజనాల కోసం పోరాడాలని గ్రామ పెద్దలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు, సేవల్లో కనీసం కొన్ని అయినా తిరిగి మేడిపల్లికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. “పోరాడితే పోయేది ఏమీలేదు… బానిస సంకెళ్లు తప్ప” అనే నినాదంతో గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల కోసం కొనసాగుతున్న పోరాటం
కరోనా మహమ్మారి సమయంలో యాచారం మండలంలోని పలు గ్రామాలకు రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించాలని పలుమార్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్, డివిఎం, ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఇటీవల కొన్ని బస్సులను పునఃప్రారంభించారు. అందులో తాటిపర్తి నైట్ హాల్ట్ బస్సు కూడా ఉండడం పట్ల గ్రామస్థులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఈ బస్సు తాటిపర్తి నుంచి ఇబ్రహీంపట్నం వరకు మాత్రమే నడుస్తుండగా, దీన్ని ఉమెన్స్ కాలేజ్ లేదా ఎంజీబీఎస్ (MGBS) వరకు పొడిగించాలని ఆర్టీసీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన అమలైతే తాటిపర్తి, కుర్మిద్ద, మీర్ ఖాన్‌పేట్, సింగారం, నందివంపర్తి గ్రామాల ప్రజలు, హైదరాబాద్‌కు వెళ్లే రైతులు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అదే సమయంలో ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుందని వివరించారు. అధికారులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని, త్వరలో ఈ మార్పు అమల్లోకి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే మేడిపల్లి–కొత్తపల్లి–ఆజిలాపురం నైట్ హాల్ట్ బస్సులు కూడా త్వరలో పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోందని తెలిపారు. బస్సులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
24 గంటల విద్యుత్ సరఫరాపై ఆశలు
నక్కర్త–మేడిపల్లి గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరా త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతుండటంతో గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే రైతులు, గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
గ్రామానికి కోల్పోయిన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సేవలు, రవాణా సౌకర్యాలు తిరిగి తీసుకురావడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



