నా చిన్నప్పటినుండి వింటున్నాను! నెల్లూరుజిల్లాలోని దుగరాజపట్నాన్ని” పేద్ద ఓడ రేవుగా ” అభివృద్ధి చేస్తారని. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు తమకు అలవాటైన రీతిలో చేసే సొల్లు ప్రసంగాలకు దుగరాజపట్నం నెలవుగా ఉండటం తప్ప రాజకీయ నాయకులు చేస్తామన్న అభివృద్ధి జరిగింది లేదు సచ్చింది లేదు. అయిన కొత్తగా అభివృద్ధి ఇప్పుడు చేయడం ఏందీ ఎప్పుడో 2000 సంవత్సరాల కితమే దుగరాజపట్నం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉండింది. శాతవాహన కాలానికే వెలసివున్న దుగరాజపట్నం, తూర్పుతీరంలో ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన రేవు పట్టణంగా ఉంటూ, మొన్నటి ఆంగ్లేయుల విస్తరణకు సైతం కేంద్ర బిందువైంది. ప్రధానంగా నీలిమందు, ఉప్పు, చక్కర, క్యాలికో గుడ్డలు, తదితర వస్తువులతో నిరంతర వాణిజ్యం జరిగేది. ఇక్కడి దొరికే కలంకారీ వస్త్రం భారతదేశంలోనే మన్నికైనదని, చౌకైనదని మేథోల్డ్ రాసాడు. గుడ్డ వెలిసిపోకుండా ఉంటూ, దాని మనోహరమైన అద్దకం గుడ్డ చినిగిన, రంగు అలాగే ఉండేదని, రాజులు ఇక్కడ దొరికే వస్త్రాలపై ఏంతో మక్కువ కలిగి ఉండేవారని పేర్కొన్నాడు. ఆంటోని స్కోరర్, డచ్ అజ్ఞాత వర్తకుడు లాంటి వారు తూర్పు కోస్తా లోని వ్యాపారాన్ని, సంఘాల్ని గురించి తమ అనుభవాలను రాశారు.
శాతవాహన, ఇక్షాకుల కాలంలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినదనడానికి ఇక్కడ దొరికిన వస్తుసామాగ్రే దానికి సాక్ష్యం. రొయ్యల గుంతలకోసం తవ్వుతున్నప్పుడు శాతవాహనాకాలం నాటి ఇటుకలు, మృణ్మయ పాత్రలు, నాణేలు విరివిగా దొరికాయి. రేనాటి చోళుల కాలంలో క్రీ.శ . 6-7 వ శతాబ్దకాలంలో ప్రముఖ రేవు పట్టణంగా వర్ధిల్లిందని కార్తికేయ శర్మ ధృవీకరించారు. ఆ తర్వాత అడపాదడపా స్పానిష్, అరబ్బుల రాతల్లో మాత్రమే మెరిసి, చరిత్రకారుల దృష్టి ఈ రేవు పట్టణంపై పడకపోవడంవల్ల ఇది సముద్రపు చీకటి లోతుల్లో ఉండిపోయింది. తిరిగి ఎప్పటికో బ్రిటీషువారు ఈ గడ్డపై అడుగుపెట్టి కొండూరుపాళెం నుంచి ఓడపాలెం దాకా ఉన్నటువంటి దుగరాజపట్నం రేవు తమ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని తలచడంతో మరల ఇది వెలుగులోకి వచ్చింది. ఆంగ్లేయులు భారతదేశంలోని తూర్పుతీరంలో వున్నమచిలీపట్నంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ కట్టినప్పటికీ అప్పుడది గోల్కొండ పాలన కింద ఉండి పెద్దగా కలసిరాలేదు. ముఖ్యంగా డచ్చి వారితో పోటీ, ఫోర్చుగీసు వారితో కలహాలు, మచిలీపట్టణం గవర్నరు విముఖత ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేని ఆంగ్లేయులు అక్కడి ఫ్యాక్టరీని మూసేసి దక్షిణాదికి వచ్చి కొంతకాలం 1621 లో డచ్చి వారితో పులికాట్లో కలిసి వ్యాపారాన్ని చేస్తారు. అక్కడ డచ్చివారితో ఉండలేక 1626 లో దుగరాజపట్నానికి వస్తారు. అక్కడ కొంత స్ధలాన్ని సేకరించి చిన్న ఫాక్టరీ, ఒక బురుజు నిర్మించుకొంటారు. దీనికి సంభందించి నెల్లూరు మాన్యువల్ లో ఇలా ఉంది.
1625 లో ఇంగ్లీషువారు కోరమాండల్ తీర ప్రాంతంతో వ్యాపార సంభందాలు ఏర్పరచుకోవాలనే భావనతో బటావియా నుండి ఒక ఓడను పంపించారు. అది సరాసరి మన దుగరాజపట్నం రేవుకు వచ్చి చేరింది. అప్పుడు ఆ గ్రామ కారణంగా ఉండిన పట్నస్వాముల ఆర్ముగం మొదలియార్ సహకారంతో ఇంగీషువారు అక్కడ కాలు పెట్టారు. దక్షిణ తీర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరం ఏర్పాటుచేసుకొనే అవకాశం ఆర్ముగం మొదలియార్ కల్గించాడు. అందుకు కృతజ్ఞతగా ఆ ప్రాంతానికి ఆర్మగాన్ అని నామకరణం చేశారు. బాస్వేల్ మాన్యువల్ రచనకు ముందే స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ఏమిటంటే, కంపెనీ వారి కూడా దుగరాజపట్నం రేవు చేరినపుడు ఆ ప్రాంతాన్ని రాజగోపాలనాయుడు ముత్తాత గురవనాయుడు పెద్దగాను, ఆర్ముగం మొదలియార్ గ్రామకరణంగాను ఉండేవారు. ఓడలో వచ్చిన కంపెనీ అధికారులు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్లను పిలిపించి తాము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలచామని, ఒక కోటను నిర్మించదలచామని చెబుతారు. ఆశతో ఇద్దరు పెద్దలు వెంటనే అంగీకరించడంతో ఆంగ్లేయులు ఎట్టకేలకు దుగరాజపట్నంలో పాగా వేస్తారు. అందుకు కృతజ్ఞతగా ఆప్రాంతాన్ని ఆర్మోగాన్ గా నామకరణం చేసి ఆ తర్వాత కొంతకాలానికి దుగరాజపట్నానికి తూర్పుదిశగా కంపెనీవారు కోట బురుజు నిర్మించారు. వాస్తవానికి ఆర్ముగాన్, దుగరాజపట్నం వేర్వేరు ప్రాంతాలు ఆంగ్లేయులు రాకముందే ఆర్మగాన్ రేవుపట్టణం ఉంది. దుగరాజపట్నానికి ఆర్మోగాన్ అనుబంధ గ్రామంగా ఉండింది. ఈ తేడాను పట్టించుకోకుండా ఆంగ్లేయులు రెండింటిని కలిపి ఆర్మోగాన్ గా వ్యవహరించారు. కొంత ద్రవ్యము సంపాదించిన ఆంగ్లేయులు ఒక అడుగు ముందు వేసి తాము నిర్మించిన బురుజు మీదనుంచి తుపాకీ పేల్చితే అది పడమటి దిశగా ఎంతదూరంలోవెళ్లి పడితే ఆమేరకు స్థలం, తమకు స్వాధీనం చేస్తే పెద్ద కోట నిర్మిస్తామని కంపెనీ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతమంతా వెంకటగిరి రాజు బంగారు యాచమానాయుడిది కనుక అంతనితో సంప్రదించి అనుమతి తీసుకొనేందుకు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్ లు ప్రయత్నం చేయగా బంగారు యాచమ నాయకుడు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీరు కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల చెన్నప్పనాయుడుతో మాట్లాడి, మైలాపూరుకు ఉత్తరంగా ఉన్న చెన్నకుప్పం అనే ప్రదేశాన్ని కంపెనీవారికి దారాదత్తం చేశారు.
ఇప్పుడు చెప్పబడిన కథలో కొన్ని అవాస్తవాలున్నాయి. అప్పటి కాలానికి చరిత్రలో, వెలుగోటివారి వంశావళిలో ప్రస్తావించని గొప్ప రాజు వెలుగోటి వెంకటాద్రినాయుడు జమానా నడుస్తుంది. ఈయన రాపూరు రాజధానిగా చేసుకొని ముప్ఫైయ్యేళ్ళు పాలించిన చరిత్రలో ఎక్కడ కనపడడు. బటర్ వర్త్ శాసనాల సంపుటిలో మాత్రం వెంకటాద్రినాయుడిని గురించి కన్పిస్తుంది. ఎందుకనో నెల్లూరు మాన్యువల్లో ఈయన గురించి ప్రస్తావించబడలేదు. ఆనాటి రాజు బంగారు యాచమానాయకుడు కాదు, కాని పొరపాటున బంగారు యాచమానాయకుడికి ఆర్మోగాన్ రేవు కథను అంటగట్టారు. అలాగే మద్రాసులో కొంత భాగాన్ని ఆంగ్లేయుల పరం చేసినవాడు కాళహస్తి జమీందారు దామెర్ల వెంకటాద్రి నాయుడే. నెల్లూరు మాన్యువల్ లో చెప్పినట్టు చెన్నప్పకాదు.
ఇవన్నీ పక్కనపెడితే ఈస్టిండియా కంపెనీకి దక్షిణాదిన మొట్టమొదటగా ఆశ్రయమిచ్చిన ఘనత దుగరాజపట్నానికే దక్కింది. ఆంగ్లేయుల అవసరాలకు సరిగ్గా సరిపోయింది ఈ రేవు.” the only place on the coromandel coast which affords any real protection to ships during an easterly gale. during the north-east monsoon the sea breaks very high on the shallow ridge of the shoal rendering the harbour within comparatively smooth”.
ఇక్కడవరకు కథ బానే ఉంది. కొంతకాలానికి ఆంగ్లేయులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. రేవు సౌకర్యంగా ఉండకపోవడం, వ్యాపారకేంద్రంగా ఎదగడానికి సంపన్నప్రాంతం కాకపోవడం, ఎగుమతులకు సరిపడా క్యాలికో గుడ్డలను ఈ ప్రాంతవాసులు అందించకలేక పోవడం, ముఖ్యంగా వెంకటగిరి రాజు వ్యతిరేక వైఖరి లాంటి కారణాలతో ఆర్ముగాన్ అభివృద్ధి కుంటుపడింది. కంపెనీవారు మధ్యవర్తుల ద్వారా స్థానిక నేతగాళ్లకు ముందుగా డబ్బులు ఇచ్చి నూలుగుడ్డలు కొనేవారు. ఇలా అడ్వాన్స్ డబ్బులు డబ్బులివ్వడానికి ఆంగ్లేయుల దగ్గర తగినంత డబ్బులు ఉండేవికావు. పై అధికారులు తగినంత పైకం పంపించేవారు కాదు. ఈ పరిస్థితుల్లో మచిలీపట్టణం, దుగరాజపట్నం రేవులలోని ఫ్యాక్టరీలను మూసివేసి, దక్షిణంగా కిందకు వెళ్లాలనుకొన్నారు. పైగా దుగరాజపట్నం బురుజు క్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం, దాని మరమ్మతుకు మచిలీపట్టణం ఏజెంటు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంతాన్ని వదిలి పెట్టసాగారు. 1638 లో కంపెనీ డైరెక్టర్లు ఆర్మగాన్ ఫ్యాక్టరీని రద్దు చేయవలసినదిగా పోర్టు అధికారికి ఫ్రాన్సిస్ డే కి ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వులు అమలుచేయకుండా డే దుగరాజపట్నం కంటే మంచి ప్రదేశము ఏమైనా ఉందా అని శోధించి పాండిచ్చేరికి వెళ్తాడు. అక్కడి అధికారులు వ్యతిరేకిస్తారు. ఈ వార్త కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల వెంకటప్ప ( వెంకటాద్రి)కి తెలుస్తుంది. వెంకటప్ప, అతని సోదరుడు అయ్యప్పలు కంపెనీ వారికి, ఇప్పుడున్న సెయింట్ జార్జి ఫోర్ట్ ప్రాంతాన్ని దారాదత్తం చేస్తారు. ఇది 1639 జులై 22 తేదీన, (1639 ఆగస్టు 22 న) ఆంగ్లేయులకు అప్పగించబడింది. దీంతో ఆంగ్లేయులు 1640 ఫిబ్రవరి 20 వ తేదికి దుగరాజపట్నం నుంచి పూర్తిగా బిచాణా ఎత్తివేశారు. దీని కోసం డే తన ఉన్నతాధికారులతో పొట్లాడం, దామెర్ల వెంకటప్పకు పర్షియన్ గుర్రాలు లంచంగా ఇచ్చి అతన్ని వలలో వేసుకోవడం, డే తన దుర్మార్గపు చేష్టలతో స్థానికులను హింసించడం, తర్వాత అంతుచిక్కకుండా చనిపోవడం లాంటి సంఘటనలు చరిత్రలో లిఖించబడ్డాయి.
ఇక మళ్ళీ మొదటికి వస్తే దుగరాజపట్నం అనుబంధంగా ఉన్న ఆర్మోగాన్ గ్రామంలో ఓడలు రాకపోకలకు, లంగరు వేయడానికి ఒక దీప స్థంభం కట్టించుకొన్నారు. భారీ నౌక శ్రయ నిర్మాణానికి 1821 లో బ్లాక్ వుడ్ సర్వే పేరుతో పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించారు. పాత దీప స్తంభము తొలగించిన తర్వాత 1853 తిరిగి కట్టబడి ఆర్మోగాన్ లైట్ హౌస్ గా చరిత్రలో నిలిచిపోయింది. దుగరాజపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకొన్న కొద్దిరోజులకే లైట్ హౌస్ నిర్మించబడి ఆనాటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. (ఇప్పుడున్న లైట్ హౌస్ కాదు ). ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతానికి ఓడపాళెం , మన పాళెంగా నేడు స్థానికులు పిలుస్తారు. ఈ లైట్ హౌస్ గురించి బాస్వేల్ మాన్యువల్, నెల్లూరు జిల్లా గెజిటీర్, ఇతర చరిత్ర ఆధారాల్లో పేర్కొనబడి ఉంది. 1853 లో నిర్మించబడ్డ లైట్ హౌస్ 137 మెట్లతో కట్టబడి గాలి, వెలుతురు వచ్చేవిధంగా పైన పెద్ద దీపం ఏర్పాటు చేయబడింది. పైనుంచి దాదాపు 15 మైళ్ల దూరం వరకు ఓడలు కనిపించేవి. ఇక్కడనుంచి మొట్టమొదటగా టెలిఫోన్ లైనుని సైతం గూడూరు దాకా వేశారు. ఇలా ఓడలకు తమ గమనాన్ని నిర్దేశించిన లైట్ హౌస్ 1923 లో మలేరియా వ్యాధి వ్యాప్తి చెంది ఉద్యోగులు మరణాలకు గురికావడంతో 1938 లో లైట్ హౌసును పూర్తిగా మూసివేశారు. లైట్ హౌస్ మీదున్న దీపం 1937 ప్రాంతంలో విశాఖపట్నంకు తరలించారని అప్పట్లో దాని ఖరీదు లక్షరూపాయలని చెపుతారు. ఆ తర్వాత 1975 లో పాత లైట్ హౌస్కు తూర్పుగా నిర్మాణం కొనసాగించి ఇప్పుడున్న కొత్త లైట్ హౌస్ 1983 లో ప్రారంభించారు. అంటే ఈ ప్రాంతంలో కట్టబడిన మొత్తం 3 లైట్ హౌసులలో ఆంగ్లేయులు కట్టిన రెండు తొలగించబడ్డాయి. భారత ప్రభుత్వంచే కట్టబడిన లైట్ హౌస్ మాత్రమే ప్రస్తుతం నిలిచి వుంది.
ఆంగ్లేయులకాలం నాటి పాత లైట్ హౌసును పూర్తిగా తొలగించి ప్రస్తుతం మంచి నీళ్ల ట్యాంకుగా వాడుతున్నారు. ఎదో ఘనకార్యం సాధించినట్టు ఆ విషయం పెద్ద బోర్డు పెట్టి అందులో వివరించి మరీ పెట్టారు. ఆహా ఎంతటి గొప్ప చారిత్రక స్పృహ ప్రభుత్వానిది. గుడ్డిలో మెల్ల కనీసం పాతదైన ఉంచారు. దూరదృష్టి, అవగాహన లేకపోవడం లాంటి భావజాలం అనాదిగా కొనసాగుతుండటం మన దురదృష్టం. స్థానిక ప్రజలకు, తెలుగు వ్యాపారస్తులకు, రాజులకు, పాలెగాళ్లకు “దూరాలోచన ఉండివుంటే మద్రాసు ఏర్పడేది కాదు”. ఆనాటి అరాచకత్వం, విజయనగర సామ్రాజ్య విచ్చితి, పాలెగాళ్ళ అంతఃకలహాలు, కరువుకాటకాలు ఆర్మోగాన్ ని అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రం కాకుండా అడ్డుకున్నాయి. ఇలా శతాబ్దాల రాజకీయాలకు బలిపీఠంగా మారి పడుతూ లేస్తూ నేటికీ తన గమనాన్ని కొనసాగిస్తుండడం విశేషం.