పవిత్రాల ఊరేగింపులో పాల్గొన్న చెవిరెడ్డి కుటుంబ సభ్యులు.
తిరుపతి రూరల్, ఆగష్టు 23, పున్నమి ప్రతినిధి
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాల్లో రెండవ రోజున ఆదివారం పవిత్ర మాలల ఊరేగింపు ఘనంగా జరిగింది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూల మూర్తితో పాటు పరివార దేవతా మూర్తులకు సమర్పించే పవిత్ర మాలలను ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, ఆయన సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పవిత్ర మాలలను ఊరేగింపుగా తీసుకువచ్చి యాగ శాలలోని వేద పండితులకు సమర్పించారు. అప్పటికే జరుగుతున్న వైదిక క్రతువులతో పాటు పవిత్ర మాలలకు ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
*కనువిందుగా స్నపన తిరుమంజనం*
పవిత్రోత్సవాల్లో రెండవ రోజైనఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతం, పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లును అభిషేకించారు. పవిత్రోత్సవాల్లో రెండవ రోజున జరిగే పవిత్రాల ఊరేగింపు, స్నపన తిరుమంజన సేవకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కనులారా వీక్షించడంతో పాటు గోవింద నామ స్మరణల మద్యన తమ మొక్కులు తీర్చుకున్నారు.




