ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. “ఫోన్‌పే, గూగుల్ పే చేస్తాం… మీరు క్యాష్ ఇవ్వండి” అంటూ దుకాణదారులను నమ్మించి, వాస్తవానికి డబ్బు బదిలీ చేయకుండానే పేమెంట్ చేసినట్లు నకిలీ స్క్రీన్‌షాట్ లేదా ఫేక్ సక్సెస్ స్క్రీన్ చూపించి నగదు తీసుకుని పరారవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఇలాంటి మోసాలకు చిన్నచిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాలు, టిఫిన్ సెంటర్లు ఎక్కువగా గురవుతున్నారు. పేమెంట్ వచ్చిందో లేదో బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ యాప్‌లో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే నగదు లేదా వస్తువులు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే:
– కేవలం కస్టమర్ చూపించే స్క్రీన్‌ను నమ్మవద్దు.
– మీ ఫోన్‌లో పేమెంట్ క్రెడిట్ అయిందో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి.
– అనుమానం వస్తే వెంటనే నగదు లేదా వస్తువులు ఇవ్వకుండా నిర్ధారించుకోండి.
– మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.
“ఒక్కసారి పేమెంట్ కన్ఫర్మ్… ఆ తర్వాతే క్యాష్ హ్యాండ్ ఓవర్” అనే జాగ్రత్తే ఇలాంటి మోసాలను అరికట్టే ఉత్తమ మార్గమని అధికారులు సూచిస్తున్నారు.



