వింజమూరు మండలం, గుండెమడకల పంచాయతీ పరిధిలోని చౌటపల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించి దేవాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా రూ.40 లక్షల వ్యయంతో శ్రీ కోదండ రామాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.
శ్రీ కోదండ రాములవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని శ్రీరామచంద్రుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.





