గణేష్ నిమజ్జనం సందర్భంగా చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి గ్రామంలో చోటుచేసుకున్న వివాదంపై గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ కులస్తులు స్పందించి బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా తమ గ్రామస్తులపై ఏకపక్షంగా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.నిమజ్జనం కోసం వచ్చిన వ్యక్తులు మద్యం సేవించి వాహనంతో ఒక వ్యక్తిని గాయపరిచిన అనంతరం వివాదం చోటుచేసుకుందని తెలిపారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 16వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా చేజర్ల, కలువాయి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారు గణేష్ విగ్రహాలను కండలేరు డ్యాంలో నిమజ్జనం చేసేందుకు తరలివెళ్లారు. ఈ క్రమంలో సుమారు 30 వాహనాలు పైన కొలపనాయుడుపల్లి మీదుగా కండలేరు డ్యాం వైపు వెళ్లినట్లు తెలిపారు.అయితే ఒక ఆటోలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తు మరొక ప్యాసింజర్ ఆటోలో ఏడుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, అదే సమయంలో కొలపనాయుడుపల్లి గ్రామంలో రోడ్డు పక్కన నిలుచున్న శివారెడ్డి అనే వ్యక్తి కాలిపై ఆటో ఎక్కించడంతో రక్తగాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు.గాయపడిన వ్యక్తిని చుట్టుపక్కల వారు పరామర్శించి, ఆటోలో ఉన్న వారిని ప్రమాదంపై ప్రశ్నించడంతో వారు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు.ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన వారు తమ గ్రామాలకు చెందిన మరికొంతమందితో వాహనాలను వెనక్కి తీసుకువచ్చి గ్రామ నడిబొడ్డున గొడవకు దిగారని గ్రామానికి చెందిన అరుంధతులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మీసం మెలేసి, తొడకొట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అక్కడున్న గ్రామస్తులతో ఘర్షణకు దిగారని తెలిపారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య తోపులాట, కొట్టుకోవడం జరిగిందని చెప్పారు.
ఎవరు ఏ గ్రామం నుంచి వచ్చారో కూడా తెలియదు
నిమజ్జనం కోసం వచ్చిన వ్యక్తులు తమ గ్రామానికి చెందిన వారు కాదని, వారు ఏ గ్రామానికి చెందిన వారో.. ఏ కులానికి చెందినవారో .. ఘటన జరిగిన సమయంలో తమకు తెలియదని కొలపనాయుడుపల్లి గ్రామానికి చెందిన అరుంధతిలు స్పష్టం చేశారు.అనంతరం వారు కలువాయి మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందినవారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని తెలిసిందని తెలిపారు.ఈ ఘటనపై ఇరువర్గాలు చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
కులం పేరుతో దూషించారని ఎలా నిర్ధారిస్తారు?
ఘటన అనంతరం కొందరు ఎస్సీ సామాజికవర్గ నాయకులు తమ గ్రామానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంపై గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇతర మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో తమకు ముందుగా ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆ రోజు అసలు ఏం జరిగిందో పూర్తిస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను నిర్ధారించిన తర్వాతే తదుపరి చర్యలు ఉండాలని వారు కోరారు.తమ గ్రామానికి ప్యాసింజర్ ఆటోలు వచ్చి మద్యం సేవించి వాహనంతో ఒక వ్యక్తిని గాయపరిచి, అనంతరం తమ గ్రామస్తులతో గొడవకు దిగిన ఘటనను పక్కనపెట్టి అగ్రవర్ణాల వారు దాడి చేశారంటూ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కొలపనాయుడుపల్లి గ్రామానికి వచ్చి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆరోజు జరిగిన పరిణామాలపై ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని గ్రామస్తులు కోరారు.ఒకవైపు ఆరోపణలు విని మరోవైపు వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా నిర్ణయానికి రావడం సరికాదన్నారు.అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారాన్ని అందించడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.శాంతియుతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు కొలపనాయుడుపల్లి గ్రామానికి చెందిన , నారిపోగు శివరామయ్య, ఆదూరు కొండయ్య బిరుదవోలు కోటయ్య ఆదూరు నాగేశ్వరరావు తదితరులు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు కోరారు.


