ఖమ్మం: ప్రయాణ సమయాన్ని తగ్గించి, అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే వరుస ప్రమాదాలతో మృత్యుమార్గంగా మారుతోంది. ఈ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలువురు గాయపడుతుండగా, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ హైవేను ఆగస్టులో ప్రారంభించారు. రాజమండ్రి, విశాఖపట్నం ప్రయాణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. అయితే, ఆగస్టు 6న ధంసలాపురం వద్ద కారు, డీసీఎం ఢీకొని చింతకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన తల్లీకొడుకు మృతిచెందడం కలకలం రేపింది. ఐదు నెలల్లో తొమ్మిది మంది మృతిచెందినట్లు సమాచారం.
నిర్దేశిత వేగపరిమితిని మించి వాహనాలు నడపడం, పర్యవేక్షణ లోపం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పూర్తికాని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంగ్‌రూట్ ప్రయాణాలు, నిషేధిత ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్ల రాకపోకలు ప్రమాదాలను పెంచుతున్నాయి. వంతెనలు, జంక్షన్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, వేగ నియంత్రణ, పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



