ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఖమ్మం నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను ప్రతిష్ఠించారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. పలు ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశాయి. గణపతి నవరాత్రుల సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తుల సందడి, గణపతి బప్పా మోరియా నినాదాలతో పలు ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


