
కరుణ చూపిన వరుణుడు నెల్లూరు, అక్టోబర్ 17 (పున్నమి విలేకరి) : చాలా కాలంగా కనిపించని వరుణుడు కరుణ చూపాడు. చినుకు చిత్తడయింది. ముసారా ముసురేసింది. గలగలలు లేని సెలయేళ్లు పర వళ్లు తొక్కాయి. నీటి జాడ లేని జలా శయాలు, ఏరులు, నదులు జలకళను సంతరించు కున్నాయి. పరుగుపరుగున పరవళ్లు మొదలుపెట్టాయి. దాదాపు ఏడేళ్లుగా కనుమరుగైన వరుణుడు చినుకు రూపంలో చిత్తడి చేసి వట్టిబోయిన నదులకు, ఏరులకు జలకళను తెచ్చాడు. వెరసి నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన పెన్నా సహా ప్రధాన నదులు, ఏరులు ఇప్పుడు పర వళ్లు తొక్కుతున్నాయి. చూపరులను మదిని పులకింపచేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో నదులు, ఏరులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రధానమైన సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. వరద నీటితో పెన్నా పరివాహక జలాశయాలు జలకళను సంతరించు కున్నాయి. దాదాపు 11 ఏళ్లు తరువాత నెల్లూరు ఆనట్ట నీటి సిరులతో కనువిందు చేస్తోంది. పరుగుపరుగున ప్రధాన కాలువల వైపు ఉరకలెత్తుతోంది. పెరుగుతున్న వరద ఉధృతి కడలి తీరం వైపు కదం తొక్కుతోంది. నెల్లూరు పెన్నా బ్యారేజీ నిండు కుండలా మారింది. జలకళను సంతరించుకుంది. చాలా కాలం తరువాత ఆనకట్ట పై పెన్నా ప్రవాహం చూసి నగర ప్రజలు పులకించిపోతున్నారు. ఉరకలెత్తుతున్న నీటి ఉధృతిని చూసి పరవ శిస్తున్నారు. మరెన్నాళ్లకో ఇలాంటి వరద ప్రవా హాన్ని చూస్తామో అన్నట్లుగా పరవళ్లు తొక్కే పెన్నను తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. సెల్పీలు తీసుకుంటూ చిరుమందహాస్యం పొందు తున్నారు. కొందరు నది వెంట ఆనం దంతో కేరింతలు కొడుతున్నారు. పెన్నా నదికి సుదీర్ఘ విరామం తరువాత వరద రావడంతో డెల్టా ఆయుకట్టులో ఆనందం వెల్లివిరుస్తోంది. చినుకు రాలదేమో చింత తీరదేమోనని దిగులు చెందుతున్న అన్నదాతలు సాగుకు డోకా లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఆనకట్ట నుంచి ఇటు సర్వేపల్లి, నెల్లూరు నగరం తాగునీటి అవసరాలకు అధికారులు నీటిని మళ్లిస్తున్నారు. సర్వేపల్లి, ముత్తుకూరు, ఈదూరు, కోడూరు, జాఫర్‌సాహెబ్ కాలువలకు ఆనకట్ట నుంచి ఇంజనీరింగ్ అధికారులు నీటిని మళ్లించారు. వరద నీటితో పరవళ్లు తొక్కే కాలువలను చూసి రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మెట్ట ప్రాంతంలోని బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు, కేతామన్నేరు, కొమ్మలేరు, కైవల్య, కాళంగి, కండలేరు సహా కాలువలు పొంగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతుంది.