మంటల్లో పూర్తిగా కాలిపోయిన బస్సు, ప్రయాణికులు సురక్షితం
పున్నమి న్యూస్ ఓజిలి
తిరుపతి జిల్లా నాయుడుపేట–చెన్నై జాతీయ రహదారి 16పై తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఓజిలి–రాచపాళెం చెరువు కల్వర్టు సమీపంలో, చెన్నై వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల నుంచి 2:15 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన AR 01 S 6404 నంబర్ గల బస్సు రేపల్లె నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తోంది. బస్సులో 19 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు.
బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులతో పాటు ఇతర సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
మంటలు చెలరేగిన బస్సును రహదారి పక్కకు నిలిపివేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఓజిలి ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టారు.
అదే సమయంలో NHAI సిబ్బంది సహకారంతో ప్రమాదానికి గురైన బస్సును రహదారికి ఒకవైపునకు తరలించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


