కలిగిరి , పున్నమి ప్రతినిధి తేది. 19-09-2026 : ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కలిగిరి మండలంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కలిగిరి మండలంలోని రావులకొల్లు పంచాయతీ ఎస్టీ కాలనీలో కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. అనంతరం కలిగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లను పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను ప్రజాసేవతో ముడిపెట్టి నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుతున్నామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షులు పుసాల వెంగపనాయుడు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, పార్టీ నాయకులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, బొల్లినేని రామారావు, చీమల తాతయ్య, సతీష్, బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సహకరించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, పేదలకు, రోగులకు అండగా నిలవడం మంచి సంప్రదాయమని పలువురు పేర్కొన్నారు.



